పోతనామాత్యుల వారి అసలు చిరునామా

రచన: వేణు రెడ్డి

ఈ మధ్య ఒక వాట్సాప్ సమూహంలో భక్త పోతన గారి పుట్టు పూర్వోత్తరాల గురించి ప్రస్తావన వచ్చి వారి నివాస  స్థలం పై కాస్త పెద్ద సంవాదమే జరిగింది. వీరేశలింగం గారి పుస్తకంలో వరంగల్లు జిల్లా అని ఒకాయన తను చదివిన పుస్తకంలో కడప జిల్లా అనే ఉందని ఇంకొకాయన, వికిపీడియా లేక  అంతర్జాలంలో వెతుక్కోమని మరొకాయన కాస్త వాట్సాప్ స్థాయిలో బాగానే వాదులాడుకున్నారు. వికిపీడియాను వీసమెత్తు నమ్మలేమని, అంతర్జాలం అంత కన్నా మోసమని మరి కొందరు సెలవిచ్చారు. తీరా అంతర్జాలాన్ని శోధిస్తే పోతన గారి నివాస  స్థలం నిర్ధారణ పై మన తెలుగు విశ్వవిద్యాలయాల్లో పెద్ద పెద్ద పరిశోధనలే జరిగాయని తేలింది (నిజం!). ఆ సందర్భంలో సరదాకు వ్రాసుకున్న లఘు కథానిక క్రిందిది, కొన్ని మార్పులు చేర్పులతో.

పోతన గారు కాకుండా ఇందులో ప్రస్తావింపబడ్డ (బడ్డ వరుసలోనే) ముగ్గురు వ్యక్తులు ఆధునిక తెలుగు సాహిత్య దిగ్గజాలు, మహాకవులు శ్రీ కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, శ్రీ శ్రీ  గారు అని పాఠక మహాశయులకు విదితమే. వారి కవితా కుసుమాలను, సందర్భానుసారంగా స్వల్ప మార్పులతో ( అంతా అసందర్భమే అని మీరనొచ్చు, తప్పు లేదు) వాడుకున్నందుకు వారికి, మీకు ముందస్తు క్షమాపణలు.

పోతనామాత్యుల వారి అసలు చిరునామా

పోతనామాత్యుల వారు రోడ్డు దగ్గరి  మైలు రాయి వద్ద విచారంగా కూర్చున్నారు. మిట్ట మధ్యాహ్నం.  పైన సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు.

ఒకటా, రెండా, 500  ఏళ్లకు పై ప్రాయం. వయో భారానికి తోడుగా  మందగించిన జ్ఞాపక శక్తి.

ఇంటికి వెళ్ళడానికి బస్సు పట్టుకోవాలి. కాని ఎంత ప్రయత్నించినా వారికి తమ ఇంటి చిరునామా గుర్తుకు రావడం లేదు. ఊరి పేరు ఏకశిల అనే గుర్తుంది కాని అది కడప మండలంలోనా,  ఓరుగల్లు మండలంలోనో గుర్తుకు రావడం లేదు. ఎవర్నడిగినా తెలియదంటున్నారు.

ఏకంగా ఆరాధ్య దైవమైన  విష్ణుమూర్తినే పిలుద్దాం ఇంటికి దారి చూపించడానికి అనుకున్నారు. కానీ ఆయనతో ఒక గొడవ ఉంది. రమ్మనగానే వచ్చేస్తాడు కానీ ఎదో పజ్జ్యంలో వారు  వ్రాసుకున్నట్లు ఆయన వెనకాల పొలో మంటూ లక్ష్మీ దేవి, ఆవిడ అంతః పుర కాంతలు, గరుడ రాజు , నారద మహా ముని, విశ్వక్సేనుడు, ఆపై ఆబాల గోపాలం, ఇలా  అంతా బయలు దేరుతారు. వీళ్ళందరికి తనకు పైబడ్డ మతిపరపు గురించి తెలియడం బొత్తిగా ఇష్టం లేదు ఆయనకు.

కానీ ఇల్లెక్కడో  ఎంత బుర్ర గోక్కున్నా గుర్తుకు రావడం లేదు వారికి.

ఏం చెయ్యటం  చెప్మా అని ఆలోచిస్తూ ఉండగా, తళతళ  మెరుస్తున్న గుండుతో, మెడలో ఉత్తరీయంతో, హుందాతనం  ఉట్టిపడుతున్న ఒకాయన వస్తూ కనపడ్డారు.

“బాబూ…!” పిలిచారు  పోతన.

కాయలుగాచిపోయినవిగా యరచేతులు!
వ్రాతగంటపున్  రాయిడి చేతనా?
మొరటు నాగలి మేడి ధరించి
సేద్యమున్ జేయుట చేతనా?”  

కరుణగద్గద కంఠoతో,  కంపమాన హస్తములను జోడిస్తూ పలకరించాడా  వ్యక్తి.

“హమ్మయ్య…ఎవరో ఒకరు గుర్తుపట్టారు,” అనుకుంటూ అడిగారు పోతనామాత్యుల వారు “బాబూ.. నా అడ్రస్ ఏమైనా చెప్పగలవా నీవు” అన్నారు.

తీరికే లేని కావ్యసాగర  మధనమందు
అలిసిపోయితివేమో దేవాదిదేవ!
ఒక నిమేషము కన్నుమూయుదువు గాని
రమ్ము! తెరచితి నా కుటీరమ్ము తలుపు!!

అంటూ పోతన గారి సంచీ, మర చెంబూ చేతిలోకి తీసుకోబోయాడాయన.

“అది కాదు నాయనా, నేనింటికి  వెళ్ళాలి.” కాస్త చిరాగ్గానే అన్నారు పోతన గారు, తన సంచీ, చెంబూ లాక్కుంటూ.

“ముని మంత్రంబు నొసంగనేల? ఇడెబో, మున్ముందు కవిమార్తాండు ర
మ్మని నే కోరగ నేల? కోరితినిబో, ఆతండు రా నేల? వ
చ్చెనుబో, కవి  నంచు నెంచక, ననున్  విలాసమడుగగా నేల”

అని పాడుకుంటూ ఒక చిరునవ్వు నవ్వి, ఉత్తరీయం దులుపుకుంటూ  ఆయనగారు చకచకా నడుచుకుంటూ చక్కా పోయారు.

పోతన గారికి నీరసమావహించింది. ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు. ఎండ తీవ్రత ఎక్కువైంది. మర చెంబులోని నీటితో గొంతు తడుపుకుంటూ ఉండగా, ఇంకొక శాల్తీ ఇటే  వస్తూ కనపడింది. గిరజాల జుత్తు, పంచ కట్టు, మెరుగు కళ్ళద్దాలు, అత్తరు ఘుమఘుమ..మోహంలో కనీ కనపడని విషాదం.

“ఎవరు నాయనా నీవు?”  పోతన గారి ప్రశ్న.

“నాకుగాదులు లేవు నాకుషస్సులు లేవు
నేను హేమంత కృష్ణానంత శర్వరిని’’.

  జుత్తు వెనక్కి సవరించుకుంటూ  నవ్వాడా వ్యక్తి.

“అవునా..!  చెప్పే వాడికి అడిగే వాడు ఎప్పుడూ లోకువే.. పోనీలే..నా ఇల్లు ఎక్కడో, ఏ ఊరో తెలిసే మార్గం  ఏమైనా చెప్పగలవా నాయనా నీవు?”

“పక్షినని పాడగలనని, ప్రణయ వీధి
నిత్య లీలా విహారముల్ నెరపుదునని,
పక్షముల దూల్చి చిరునామాలడిగియడిగి
గానమును ప్రాణమును హరింపబూనినారు”  

అని భోరున విలపిస్తూ వెళ్ళిపోయాడా ప్రేమపిపాసి , సింహం జూలు దువ్వుకుంటూ .

“ఇప్పుడేవన్నాని ఏడుస్తాడు” గొణుక్కున్నారు పోతనామాత్యులు.

పోతన గారి ప్రాణం ఉసూరుమంది! ఇంటికి వెళ్ళడo ఎలా చెప్మా..? అనుకుంటుండగా, ఎదో మరో ప్రపంచంలో ఉన్నట్టు, నోట్లో సిగరెట్టుతో,   ఏవీ పట్టించుకోకుండా హడావిడిగా వెళ్ళిపోతున్న మరొకాయన తారసపడ్డాడు.

“ఆగు బాబు…ఆగు..నీవెవరు?”

“భూతాన్ని,
యజ్నోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!”

“ఇల్లు తప్పిపోయాను బాబు..ఇంటికి వెళ్ళే మార్గం ఏదైనా చెప్పగలవా?”  అన్నారు పోతన.

పోనీ, పోనీ, పోతే పోనీ! సతుల్‌, సుతుల్‌, హితుల్‌
పోనీ పోతే పోనీ! రానీ, రానీ, వస్తే రానీ!
కష్టాల్‌, నష్టాల్‌, కోపాల్‌, తాపాల్‌, శాపాల్‌,
రానీ! వస్తే రానీ! తిట్లూ, రాట్లూ, పాట్లూ,
రానీ! రానీ, రానీ!  కానీ, కానీ!
గానం, ధ్యానం! హాసం, లాసం!
కానీ! కానీ! కళారవి! పవీ! కవీ

అంటూ నడచు కుంటూ వెళ్ళిపోయాడా  మహానుభావుడు వడివడి అడుగులతో.

పోతనామాత్యులు మళ్ళీ మైలు రాయి మీద చతికిల పడ్డారు…ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు. మరి మీలో  ఎవరైనా రూఢిగా చెప్పగలరా వారి అసలు చిరునామా?

రచన: వేణు రెడ్డి

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి