అండం

గమనిక: Andy Weir అనే అమెరికన్ రచయత (The Martian సినిమా తాలూకు) ‘The egg’ అనే కథానికను ఆంగ్లంలో 2009 సం. లో public domain లో వ్రాసాడు. చాలా ప్రాచుర్యం చెందడమే కాకుండా, అనేక భాషల్లోకి ఇది అనువదింపబడింది.

ఆ కథకు తెలుగు అనువాదం క్రింద మీ కోసం.

అయితే, ఈ కథకే అనువాదమెందుకని మీ భేతాళ ప్రశ్న కావచ్చు. ఒక మంచి (గొప్ప) కథకు సర్వకాలిక సమకాలీనత (perpetual contemporaneity) , సార్వజనీనత (universality) ఉండాలని పెద్దల ఉవాచ. ఆ రెండూ ఈ కథకు పుష్కలంగా ఉన్నాయని నా స్వాభిప్రాయం. 🙏

మూల రచన: Andy Weir
అనువాదం: వేణు రెడ్డి

అలా చనిపోయావు నువ్వు… ఆ రోజు ఇంటికి తిరిగివెడుతున్న వేళ.

అదో కారు ప్రమాదం. చెప్పుకోదగ్గ విశేషమేమీ కాదు కాని చావు తప్పలేదు. భార్య, ఇద్దరు పిల్లలు నీకు… కాని అట్టే కష్టం లేకుండానే పోయిన ప్రాణం. అంబులెన్స్ సిబ్బంది శాయశక్తులా కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. యాక్సిడెంట్లో ముక్కలుముక్కలైన నీ శరీరం బతికుంటే పడబోయే అవస్థ కన్నా త్రుటిలో ప్రాప్తించిన మృత్యువే హాయి, నన్నడిగితే.

అప్పుడు కలిసావు నన్ను.

“ఏవిటి… ఏం జరిగింది?” అడిగావు. “ఎక్కడ ఉన్నాన్నేను?”

“చనిపోయావు.” అన్నాను యధాతధంగా. ఈ విషయాల్లో డొంక తిరుగుడు అనవసరం.

“ఎదురుగా… అదుపు తప్పిన లారీ…”

“అవును,” తల పంకించాను.

“నేను… నేను చనిపోయానా?”

“అవును. కానీ అట్టే బాధ పడకు. అందరూ పోవాల్సిందే ఎదో ఒక రోజు,” అన్నాను. “జాతస్య మరణం ధృవమ్!”

Pic credits: Sneha Koti

చుట్టూ పరిసరాలను గమనించావు. అంతటా శూన్యం…నువ్వు, నేను తప్ప.

”ఎక్కడున్నాన్నేను?” అడిగావు. “ఇదే పరలోకమా?”

“ఇంచుమించుగా,” అన్నాను నేను.

“మీరు భగవంతుడా?” ప్రశ్నిస్తూ అడిగావు.

“అవును,” అన్నాను సమాధానంగా. “నేనే దేవుణ్ణి.”

“నా పిల్లలు… నా భార్యా…,” నీ కళ్ళు చెమర్చాయి.

“వాళ్ళ గురించేంటి?”

“వాళ్ళు క్షేమంగానే ఉంటారా?”

ఇదే నాకు నచ్చే విషయం,” మెచ్చుకోలుగా అన్నాను. ”చనిపోయి పట్టుమని పది క్షణాలైనా గడవలేదు అప్పుడే నీ ఆత్రత అంతా నీ కుటుంబం గురించే. హర్షణీయం!”

నన్ను ఆశ్చర్యంగా పరిశీలించావు. నీ కంటికి, నేను దేవుడిలా కనపడట్లేదు. పురుష రూపంలోనో లేక స్త్రీ రూపంలోనో ఉన్న మనిషిలానే కనిపిస్తున్నాను. మహా అయితే పని పురమాయించే ఏ అధికారిలాగానో . దేవుడి కన్నా కూడా తెలుగు వ్యాకరణం మాష్టారులానే ఎక్కువగా కనిపిస్తున్నాను నీకు.

మరీ అంత దిగులు పడాల్సిందేమీ లేదు” అన్నాను ఓదార్పుగా. ”వాళ్ళకేం ఫర్వాలేదు. నీ పిల్లలకు నువ్వు అన్ని రకాలా మంచివాడిలానే మిగిలిపోతావు. ఇంకా చిన్నవాళ్లవడంతో వాళ్ళకు నీ మీద చులకనో, ఏవగింపో ఏర్పరుచుకునేంత సమయం చిక్కలేదు వాళ్ళకి. నీ భార్య పైకి గోడు గోడున ఏడ్చినా, లోపల్లోపల ఊపిరి పీల్చుకుంటుంది. తుమ్మితే ఊడే ముక్కు లాంటి మీ దాంపత్యంలో, అనురాగం కన్నా నిర్లిప్తతే ఎక్కువ. నీక్కాస్త ఊరట కలుగుతుందనుకుంటే ఒక మాట చెప్తాను… ఇన్నేళ్ళ కాపురం తరువాత నువ్వు పోతే, లోపల ‘హమ్మయ్య!’ అనుకున్నందుకు తను కాస్తో కూస్తో పశ్చాత్తాపం కూడా పడుతుంది!”

“మరిప్పుడు జరగబోయేదేంటి?” అడిగావు. “నన్ను స్వర్గానికో నరకానికో పంపిస్తారా?”

“అదేదీ కాదు,” అన్నాను. “ఇంకో జన్మ ఎత్తుతావు.”

“ఆహాఁ..!” అన్నావు. “మా హిందూ మతంలో చెప్పింది సత్యమే అయితే!!”

“అన్ని మతాలూ సత్యమే. దేని దృక్కోణంలో అది,” అన్నాను. “పద, అలా తిరిగొద్దాము”.

శూన్యంలో నాతో పాటు అడుగులు వేయసాగావు. “ఎక్కడికి వెళ్తున్నాము?”

“గమ్యం అంటూ ఏవీఁ లేదు,” అన్నాను. “నడుచుకుంటూ మాట్లాడుకుంటే బావుంటుంది.”

మరైతే దీనికంతా అర్థం ఏమిటి?” ప్రశ్నించావు. “నేనింకో జన్మ ఎత్తితే, తెల్ల కాగితంలా మళ్ళీ అంతా కొత్తే కదా! వచ్చే జన్మలో ఏమీ తెలియని పసిబిడ్డాడిలా మొదలెడితే, ఈ జన్మలో నా కర్మానుభవాలన్నీ లెక్కలోకి రానట్లేగా?”

“అహాఁ, అలా కుదరదు!” నవ్వాను. “…నువ్వింతవరకు జీవించిన మొత్తం అన్ని జన్మల స్మృతులు, గడించిన అన్ని అనుభవాలు, సాధించిన వివేచన అన్నీ నీలోనే నిక్షిప్తమై ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం నీకిప్పుడవేమీ గుర్తుకు లేవు. అంతే!”

అప్రయత్నంగానే నీ భ్రుకుటి ముడిపడింది.

నడవటం ఆపి, నీ భుజంమీద చెయ్యి వేస్తూ నిన్ను నా వేపు తిప్పుకున్నాను అనునయంగా.

”చూడూ, నీ నిజ రూపం నీ ఊహకు అందని ఒక చైతన్య స్వరూపం. అది నిరాకారం, నిర్గుణం, అనాదిమధ్యాంతం, అనశ్వరం. ఇంద్రియరూపమైన నీ మనస్సు తనలో సంక్షిప్తపర్చుకోగలిగేది ఆ బృహత్తరమైన ఆత్మలో ఒక శతాంశాన్ని మాత్రమే. స్థూలంగా చెప్పాలంటే ఇది నీళ్ళు వేడిగా ఉన్నాయా లేదా అని గ్లాసులో వేలు పెట్టడం లాంటిది. వేలి అంచుని మాత్రమే గ్లాసులో పెట్టినా దాన్ని బయటకి తీసినప్పుడు, కేవలం ఆ స్పర్శానుభవంతో, నీటికున్న మొత్తం అనుభవాల్ని , అనుభూతుల్ని వేలు తనకు ఎలా ఆపాదించుకుంటుందో, నీ మనస్సూ అంతే!”

“నువ్వు నీ భౌతిక శరీరంలో 48 ఏళ్లు గడిపి వస్తున్నావు కాబట్టి అపారమైన నీ సంపూర్ణ చైతన్య స్వరూపం నీ జ్ఞాతంలోకి రాలేదింకా. ఇంకాసేపు మనమిక్కడే ఇలాగే ఉన్నామంటే, నీకు అంతా గుర్తు రావడం మొదలెడుతుంది. కాని జన్మకీ జన్మకీ మధ్యలో దీన్నిలా గుర్తు తెచ్చుకోవడంలోనూ అర్థం లేదు.”

“అయితే నేనిప్పటిదాకా ఎన్ని జన్మలెత్తానంటారు?”

“ఎన్నో! ఎన్నెన్నో సార్లు. చాలా చాలా జీవితాల్లోకి.” అన్నాను. “మరి ఈ సారికి, నీ పుట్టుక క్రీస్తుశకం 540 లో చైనా దేశంలో ఒక పల్లెటూరి కుటుంబంలో ఆడపిల్లగా!”

“ఆగండాగండి,” అన్నావు తత్తరబాటుతో. ”అంటే మీరు నన్ను కాలంలో వెనక్కి పంపిస్తున్నారా?”

“నీ కాల ప్రమాణంలో చెప్పుకోవాలనుకుంటే అంతే అనుకో. కానీ నీకు అది తెలిసిన కాలం. దాని అస్తిత్వం, దిశ, గమనం నీకు తెలిసిన జగత్తులో ఉన్నవి మాత్రమే. నేనుండే చోట వస్తు పదార్థ జాలం, దాని ధాతువులు, వాటి సమీకరణాలు వేరు.”

“మీరెక్కడ్నుంచి మరి?”

“నేనూ ఎక్కడి నుండో వచ్చిన వాడినే. ప్రస్తుతం నీ ఊహకందని చోటు అది. నాలాగా ఇంకా చాలా ఉన్నారు. అదేమిటో, అక్కడెలా ఉంటుందో తెలుసుకోవాలని నీకు ఉత్కంఠగా ఉందని నాకు తెలుసు. కాని ఇప్పుడు చెప్పినా నీకవన్నీ ఆకళింపుకు రావు.” వీలైనంత విడమరుస్తూనే చెప్పాను.

“అవునా,” అన్నావు కాస్త నిరాశగా తలాడిస్తూ. ”కాని… ఒక ప్రశ్న.. నేను వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు కాలాల్లో రకరకాల పునర్జన్మలు ఎత్తుతూ ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు నాకు నేనే తారస పడి ఉండొచ్చుగా?”

“ఓస్ .. ఎప్పుడూ జరిగేదే అది… సర్వసాధారణ విషయం..!! కాకపొతే నువ్వెత్తే ఆయా జన్మరూపాల పరిధి వాటి జీవిత చట్రాలకే పరిమితం, అందుకే నీకిదంతా జరుగుతున్నదన్న విషయం కూడా తెలీదు.”

నీ కళ్ళల్లో విస్మయం. “దేనికిదంతా?”

“అంటే?” అడిగాను. ”జీవితానికి అర్థం ఏంటని అడుగుతున్నావా? యుగాల తరబడి మూసలో పోసి మళ్ళీ మళ్ళీ అడిగే తర్క ప్రశ్నలా లేదిది?”

“కానీ సబబైన ప్రశ్నే కదా,” నువ్వు వదల్లేదు.

నీ కళ్ళలోకి చూసాను. ”జీవితానికి పరమార్థం, నేనీ విశ్వాన్నంతా సృష్టించడానికి కారణం, నువ్వు పరిణత చెందడానికి.”

“మీరనేది మా మానవాళి అంతానా? మేమంతా పరిపక్వత చెందడానికా?”

“కాదు, నీ ఒక్కడి కోసమే. నేనీ జగత్తును సృష్టించిందే నీ ఒక్కడి కోసం. పుట్టిన ప్రతి జన్మలో నువ్వు పరిణత చెందుతూ, జ్ఞానసంబుద్ధిని సమకూర్చుకుంటూ పోతావు .”

“నా ఒక్కడి కోసమా? మరి మిగతా వాళ్ళ మాటేమిటి?”

“ఇంకెవరూ లేరు.” అన్నాను. “ఈ విశాల విశ్వంలో ఉన్నది నువ్వు, నేను. అంతే!”

నోరప్పగించి చూస్తుండిపోయావు . ”మరి భూమ్మీద మనుషులందరూ…”

“అందరూ నువ్వే. అన్నీ నీ జన్మరూపాలే.”

“ఆగండాగండి..నేను అందరినా!?” విస్తుపోతూ అడిగావు.

“ఇప్పుడు అర్థమౌతోంది నీకు.” అన్నాను, వెన్ను తడుతూ.

“అంటే నేను భూమ్మీద ఇంత వరకు జన్మించిన ప్రతి ఒక్కరినా?”

“ఇక ముందు పుట్టబోయే ప్రతి ఒక్కరివి కూడాను, అవును.”

“నేను అబ్రహం లింకన్ నా?”

“ఆయన్ని చంపిన జాన్ విల్క్స్ బూత్ వి కూడా,” అన్నాను అందుకుంటూ.

“అంటే నేను హిట్లర్ కూడా అంటారా?” అన్నావు నిర్ఘాంతపోతూ.

“అంతే కాదు. హిట్లర్ హతమార్చిన లక్షలాది ప్రజానీకానివి నువ్వే.”

“గాంధీ?”

“ఆయన్ని అనుసరించిన కోటానుకోట్లల్లో ప్రతి ఒక్కరివి కూడా.”

నిశబ్దంగా ఉండిపోయావు.

నిస్సహాయంగా ఉన్న సాటి జీవి మీద నువ్వు దౌర్జన్యం చేసిన ప్రతీసారి,” అన్నాను, ”ఆ దురాగతం జరిగేది నిజానికి నీ పైనే. ఉదాత్త భావంతో, దయాపేక్షలతో చేసే పరోపకారమేదైనా , అది నీ కోసం నువ్వు చేసుకునే సాయమే. ఈ జగత్తులోని భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ప్రతి మనిషి అనుభవించే ప్రతి కష్టం, సుఖం, మంచి, చెడూ అన్నీ అంతర్లీనంగా నువ్వూ చవి చూస్తావు.”

దీర్ఘమైన ఆలోచనలో పడ్డావు.

ఎందుకు?” మళ్ళీ అడిగావు. ఇదంతా చెయ్యడానికి కారణం ఏంటి?”

“ఎందుకంటే, ఏదో ఒక రోజు, నువ్వూ నాలాగ రూపు దిద్దుకుంటావు. నువ్వూ మాలో ఒకడివే. అదే నీ నిజస్వరూపం. నువ్వు నా ప్రతిరూపానివి.

“అవునా,” అన్నావు నమ్మశక్యం కానట్లుగా. ”నేను దేవుడినంటారా?”

“అహఁ… అప్పుడే కాదు. నువ్వు ఒక పిండం…పెరుగుతున్న అంకురానివి. ఎప్పుడైతే సృష్టిలోని గతాగత కాలాల్లోని జన్మలన్నీ జీవించి జన్మరాహిత్యం పొందుతావో అప్పుడు నాలా రూపాంతరం చెందుతావు. రూపు దిద్దుకుంటున్న ఈశ్వరాంశవి నువ్వు.

“అయితే ఈ జగత్తంతా,“ అన్నావు, ”ఇదంతా ఒక…“

ఒక అండం. అన్నాను సమాధానంగా. ”..ఇక తెమలాలి మరి. నీ పునర్జనన సమయం దగ్గిర పడింది.”

అలా అప్పుడు నీ గమ్యం వైపు దోవన నిన్ను సాగనంపాను.

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి