2025 – మర్చిపోయిన ముగ్గు
(కథ – TheForgottenMuggu ) Top 3 : Winning story at Ammulu -Telugu Short Story Writing Competition
ఆంధ్రప్రదేశ్‌లోని ఓ నిదానమైన పట్టణంలో, మామిడి చెట్ల నీడల మధ్య ఉన్న వీధిలో, ఒక సాధారణ గృహిణి విద్య జీవించేది. ఆమె భార్య, తల్లి, కోడలు—ఆమె జీవితం వంటలు, పనులు, కుటుంబసభ్యుల అవసరాల చుట్టూ తిరుగుతూ పోతూ ఉండేది.
ప్రతి ఉదయం, సూర్యుడు ఉదయించే ముందే, తలుపు ముందున్న నేల తడిపి, బియ్యం పిండితో ముగ్గు వేయడం ఆమె నిత్యకృత్యం. ఇది ఆమె తల్లి చెప్పిన సంప్రదాయం.
“మగ్గు ఎరువులు కావు అమ్మా… ఇది మన ఇంటికి లక్ష్మీ దేవిని ఆహ్వానించడమే.”
ఆమె కుమార్తె భాను చిన్న వయసులోనే అమ్మను చూసి అడిగింది:
“అమ్మా, నువ్వు ప్రతి రోజు ఎందుకు ముగ్గు వేస్తావు?”
విద్య నవ్వింది.
“ఇది మన ఇంటికి ఆనందాన్ని తీసుకొచ్చే పద్ధతి బంగారం. వెలుగులా ఉంటుంది, ఉదయపు సూర్యుడిలా.”
అలా, ప్రతి రోజు ఆమె వేసే ముగ్గు ఒక ప్రార్థనలా నేల మీద వికసించేది.
ఒకసారి విడిచిన ఆచారం
కాలం మారింది. పనులు పెరిగిపోయాయి. భర్త రాఘవ ఆఫీసుకు తొందరగా వెళ్ళిపోవడం, అత్తమామలు రామయ్య మరియు సత్యవతికి మందులు, భోజనాలు సమయానికి అందించడం, భాను స్కూలుకు తయారవడం—పనులన్నీ ఒక ప్రాతంలా మారిపోయాయి.
ఒక రోజు విద్య ముగ్గు వేయడం మరిచిపోయింది. ఎవ్వరూ గమనించలేదు. మరుసటి రోజు కూడా మళ్ళీ మరిచిపోయింది. అలా రోజులు గడుస్తూ పోయాయి.
ఒక చిన్న చూపు
ఒక సాయంత్రం, విద్య బట్టలు మడుస్తూ ఉండగా, భాను చేతిలో బియ్యం పిండి గిన్నెతో వచ్చి అడిగింది:
“అమ్మా… నువ్వు ఇప్పుడు ఎందుకు ముగ్గు వేయడం మానేశావు?”
విద్య ఒక క్షణం ఆగిపోయింది.
“ఎవ్వరూ గమనించరు కదా భాను. నేను వేసినా ఏముంటుంది, మానేశినా ఏముంటుంది?”
భాను నెమ్మదిగా అంది:
“కానీ… నువ్వు వేసేటప్పుడు నవ్వుతావు అమ్మా.”
ఆ మాటలతో విద్య మనసు ఒక్కసారిగా కరిగిపోయింది.
తనను తానే గుర్తించిన రాత్రి
అంతా నిద్రలోకి జారిన ఆ రాత్రి, విద్య మళ్లీ బయటకు వెళ్లింది. ఆకాశంలో చంద్రుడు మసకమవుతున్నాడు. గాల్లో మల్లెపూల వాసన.
ఆమె మడమపై మడమ వేసి కూర్చుని, గిన్నె చేతిలోకి తీసుకుంది. నెమ్మదిగా అంకురాలు వేసింది.
ప్రతి గీతలో, ఆమె తాను తానే గుర్తించుకుంది.
ఆ రాత్రి ఆమె వేసిన ముగ్గు సాధారణ ముగ్గు కాదు. అది ఆమె అంతరాత్మను మళ్లీ చూసే ప్రయత్నం.
పునరాగమనం
మరుసటి రోజు ఉదయం. తలుపుదగ్గర రాఘవ కాఫీ తాగుతూ నిలబడి ఉన్నాడు. ముఖంలో చిన్న నవ్వు.
సత్యవతిగారు కూడా వచ్చారు.
“ఇల్లు మళ్లీ జీవంతో కనిపిస్తోంది విద్య,” ఆమె మృదువుగా అన్నారు.
“ఇన్నాళ్లుగా ఆ తలుపు ముందు మాయమైపోయినట్టే అనిపించేది మాకు,” రాఘవ అన్నాడు.
విద్య ఆశ్చర్యపోయింది. ఎవరికీ తెలియకుండా వేసిన ముగ్గును… అందరూ గుర్తించారు!
భాను పరిగెత్తుకుంటూ వచ్చి:
“ఇప్పటి నుంచి నేను కూడా నిన్న వెంట తీసుకుని ముగ్గు వేస్తాను అమ్మా!”
ఆమె నవ్వుతూ గిన్నె ఇచ్చింది. ఆ రోజు ముగ్గు ఇద్దరి చేతుల్లోనూ వికసించింది—ఒక సంప్రదాయం, ఒక ప్రార్థన, ఒక గుర్తింపు.
నీతి
బాధ్యతల భారం నడుమ మనసుకు శాంతినిచ్చే చిన్న ఆనందాలను మర్చిపోతాం.
కానీ వాటిని మళ్లీ పొందినప్పుడు, మన ఆత్మను మళ్లీ కనుగొంటాం.
(కథ 1 – మానస ) Winning story at Ammulu -Telugu Short Story Writing Competition
రాత్రి పదిన్నరవుతోంది.మానస మంచం మీద విసుగ్గా అటూ ఇటూ కదులుతోంది, ఎంత ప్రయత్నించినా నిద్రా దేవి కరుణించట్లేదు.అరగంట క్రితం గుండెల్లో సన్నని మంట మొదలయ్యింది.లేచి కాస్త మజ్జిగ కలుపుకుని తాగిందే కానీ అరగంటైనా తగ్గట్లేదు.
మంచం దిగి మాస్టర్ బెడ్రూం లోకి వెళ్ళింది. అక్కడ పని చేసుకుంటున్న భర్త దీపక్ కనీసం ఈమె రాకని గమనించినట్లు కూడా లేదు.కొన్ని సెకన్లు అతనికెదురుగా నిలబడి తనని గమనించట్లేదని బాత్రూంలోకి వెళ్ళి వచ్చి మళ్ళీ నిలబడింది. తను వచ్చాను అన్న సంకేతంగా సన్నగా దగ్గింది. ఏమిటీ అన్నట్లు విసుగ్గా తలెత్తి చూసాడు దీపక్. ఏంటో గుండెల్లో మంటగా ఉంది అంది సన్నని గొంతుతో.అయితే ఏమిటీ అన్నట్లుగా చూసాడు. మజ్జిగ త్రాగాను ఇంకా తగ్గట్ల్లేదు అంది అతని మొహంలో మారే భావాలని చూస్తూ. అయితే ఏమంటావు,హాస్పిటల్ కి వెళ్దామా వద్దా చిరాకు ధ్వనిస్తుండగా అరిచినట్టే అన్నాడు.
ఒక్క నిమిషం మానస మనసు బాధతో మూలిగింది వెంటనే తేరుకుని వద్దులే అని చెప్పి తన గదిలోకి నడిచింది. నెప్పంటావు డాక్టరంటే వద్దంటావు ఏమి చెయ్యమని నీ ఉద్దేశ్యం అసహనంతో దీపక్ అంటున్న మాటలు తన చెవిన పడ్డా దిండులో తలదాచుకుని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తోంది మానస.
ఏమిటో మనసులో ఎడ తెగని ఆలోచనలు, ఏమిటి తన జీవితం ఇలా?? ఇద్దరికీ మంచి ఉద్యోగాలు,చక్కటి ఇల్లు, ఒక్కడే సంతానం, అయినా తామిద్దరి మధ్యా ఏదో అడ్డుగోడలు. గత కొద్ది సంవత్సరాలుగా తమ పడకలు వేరయ్యేంత దూరం.తప్పెక్కడుందో ఎంత ఆలోచించినా అర్ధం కావట్లేది మానసకి.నిద్ర పట్టక లేచి తన గదిలో చదువుకుంటున్న కొడుకు శశాంక్ దగ్గరకి వెళ్ళింది. ఏమిటమ్మా అన్నట్లు తలెత్తి చూసాడు పదహారేళ్ళ కొడుకు.ఏమీ లేదురా నిద్ర పట్టక ఇలా వచ్చాను.మొన్న కెమిస్ట్రీ నోట్స్ ఏదో రాసుకోవాలన్నావు, రాయనా అని అడిగింది. రాసిపెడతా అని తల్లి అనేసరికి అమ్మా ప్లీజ్ ఇదిగో మా ఫ్రెండు నోట్సు, అయినా టాపిక్ చూస్తే నువ్వే ఇంటర్నెట్లో చూసి చక్కటి నోట్సు ప్రిపేర్ చేస్తావుగా అంటూ నోట్సు అందించాడు.
వాడిని చూసి చిన్నగా నవ్వుకుంది మానస.ఏమిటో ఈ చదువులూ అని నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళి ల్యాప్ టాప్ ఆన్ చేసి నోట్సు రాయడంలో మునిగిపోయింది.
అలా రాస్తూ రాస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు. దాహమేసి మెలకువొస్తే టైము చూసింది.ఉదయం నాలుగున్నరవుతోంది.నీళ్ళు త్రాగి ఇలా పడుకుందో లేదో మళ్ళీ గుండెల్లో మంట మొదలు.ఇది మామూలే కదా అనుకుని నిద్ర పోవాలని ప్రయత్నిస్తోంది కానీ నెప్పి అంతకంతకూ ఎక్కువవుతోందే తప్ప తగ్గట్లేదు. కొద్ది నిమిషాల్లోనే తట్టుకోలేనంత నెప్పి. శరీరమంతా ఏదో బాధ.లేచి భర్తని పిలుద్దామనుకుంటొంది కానీ లేవలేకపోతోంది. ఓక ఐదు నిమిషాల తరువాత ఈ పెనుగులాట ఆగింది. హమ్మయ్య అనుకుని మానస లేవబోయింది.ఏంటో శరీరమంతా తేలిగ్గా అయిపోయింది.మంచం దిగలేకపోతోంది.గాల్లో తేలినట్లనిపిస్తోంది.మానసకి ఒక్క నిమిషం ఏమీ అర్ధం కాలేదు. తనేమో గాలిలో తేలుతోంది ఇంకో పక్క తనేమో మంచం మీద నిశ్చలంగా పడుకుని ఉంది. తరచి చూసుకుంటే తను మనిషి శరీరంలోంచి బయటకొచ్చేసి ఉంది.అంటే అంటే తను చచ్చిపోయిందా?? మానసకి నమ్మశక్యంగా లేదు తను చనిపోయిందంటే.
తెల్లవారింది,కొడుకు లేచి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి అమ్మా అని లేపడానికి తన దగ్గరకొచ్చాడు.నాన్నా, నేను లేనురా అని చెప్పాలనుకుంటొంది కానీ చెప్పలేకపోతోంది. తన శరీరాన్ని అటూ ఇటూ కదిపి చూసి ఏదో అనుమానం వచ్చి నాన్నా అంటూ పరిగెత్తుకెళ్ళాడు. ఓ ఐదారుసార్లు లేపితే కానీ లేవలేదు దీపక్. అమ్మా లేవట్లేదు నాన్నా దాదాపు ఏడుపు గొంతుతో అన్నాడు శశాంక్.ఒంట్లో బాగాలేదంది పడుకుని ఉంటుందిలే నువ్వు తిన్నావా అని నిద్ర మత్తులోనే అడిగాడు. నాన్నా ఒక్కసారి అమ్మని చూడు మరోసారి అడిగాడు శశాంక్.విసుగ్గా మంచం మీదనించి లేచి తనని లేపడానికి ప్రయత్నించడం చూస్తూనే ఉంది. ఏదో అనుమానం వచ్చి కింద ఫ్లాట్లో ఉండే డాక్టర్ జగదీశ్వర్కి ఫోను చేసాడు. డాక్టరు గారొచ్చి చూసి పెదవి విరిచారు. నిద్రలోనే హార్ట్ ఎటాక్తో పోయింది దీపక్, కానీ పాపం బాగా ఇబ్బంది పడినట్లుంది చివరి క్షణాల్లో అనిపిస్తోందయ్యా మొహం చూస్తే.ఓ రెండు గంటలయినట్లుందయ్యా అందరికీ ఫోన్లు చెయ్యి అయాం సారీ అనేసి వెళ్ళిపోయారు.
తనని ఒక కొత్త చాపలో పడుకోపెట్టి తల దగ్గర దీపం పెట్టారు.అందరూ వచ్చారు.ఏమిటే అప్పుడే వెళ్ళిపోయావా అంటూ తన తల్లితండ్రులూ, అక్కలు ఏడ్వటం తనకి కనిపిస్తూనే ఉంది. కొడుకు శశాంక్ మొహం చూస్తే తనకి జాలేస్తోంది.కానీ ఏమీ చెయ్యలేదు.ఒక్కసారి వాడిని తడిమి చూసుకోవాలనుంది కానీ అయ్యే పని కాదని తెలుసు. అయ్యా సూర్యాస్తమయం కాకముందే కార్యక్రమాలు నిర్వహించాలి కానెయ్యండి తొందర పెట్టారెవరో. అయిపోయింది అంతా అయిపోయింది నిన్నటి వరకూ తిరిగిన ఇంట్లో నుండి తనని తీసుకెళ్ళిపోతున్నారు.ఇంక తను ఏమీ చెయ్యలేదు. భర్త దీపక్ యాంత్రికంగా పురోహితుడు చెప్పిన క్రతువు చేస్తూ ఉన్నాడు ఎప్పటిలాగే అభావంగా.ఏంటి నేను అక్కర్లేదా, ఎప్పటికీ తిరిగి రానని తెలిసి కూడా ఏమిటి ఈ మనిషి అనుకుంటొంది మానస ఆత్మ. కాసేపటికి తనని చితి మీద పేర్చి కట్టెలతో కప్పెస్తున్నారు. చివరిసారిగా ఒక్కసారి చూడు బాబూ అన్నారు మానస నాన్నగారు, ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ. నిర్లిప్తంగా నడచి వచ్చి మానస ముఖం లోకి చూసి తల అటు తిప్పుకున్నాడు దీపక్.కొడుకు శశాంక్ పాపం ఏడ్చీ ఏడ్చీ వాడి బుగ్గలమీద కన్నీటి చారికలు కట్టేసాయి.ఇదే ఆఖరుసారి తన వాళ్ళని చూడటం అనుకుంటుండగా భగ్గున లేచిన అగ్ని జ్వాలలు తన శరీరాన్ని చుట్టేసాయి.
బాబూ కపాల మోక్షమయ్యింది ఇంక బయలుదేరండి అన్న కేక వినపడటంతో అందరూ ఇంటికి బయలుదేరారు.
దీపక్ ఇంటికొచ్చి అలా సోఫా వంక చూసాడు.తన కంటే అప్పుడప్పుడు ముందరే ఆఫీసు నుండి వచ్చినప్పుడు మానస అక్కడే కూర్చుని కాఫీ తాగుతూ పుస్తకం చదువుకుంటూ ఉండేది.ఒక్కసారి తల విదిల్చి లోపలకి వెళ్ళిపోయాడు.
మానస వెళ్ళిపోయి మూడు రోజులు కావస్తోంది.బంధువులూ, స్నేహితులు, చుట్టు పక్కల వారి పరామర్శల తాకిడి ఇంకా తగ్గలేదు. నాలుగో రోజు మధ్యాహ్నం బయట వాళ్ళు ఎవరూ లేరు ఇంట్లో.కట్టాల్సిన బిల్లులు అవీ చూద్దామని కూర్చోపోతుండగా నాన్నా , రాజీ ఆంటీ వచ్చింది అని చెప్పాడు శశాంక్. రాజి, మానస ఒకే ఆఫీసు. మానస అక్కడ చేరేటప్పటికే రాజి అక్కడ సీనియర్. ఆవిడ పర్యవేక్షణలో పని నేర్చుకుని స్వతాహాగా తెలివైనదైన మానస అతి త్వరలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలిగింది.
అయాం సారీ దీపక్, ఊర్లో లేకపోవడం వల్ల ఆరోజే రాలేకపోయాను, రాగానే మా కొలీగ్స్ చెప్పడంతో షాకయ్యాను అంది రాజి ఉబికి వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ.అసలిదంతా ఎలా జరిగింది అని అడిగింది రాజి. ఏమో ముందు రోజు రాత్రి కాస్త ఆలశ్యంగా నిద్ర పోయిందంతే, మరునాడు లేచి చూసేసరికి..అని ఆగిపోయాడు దీపక్. మానస గుండెల్లో మంటగా ఉందనడం ఇవన్నీ అనవసరనిపించి చెప్పలేదు.కాసేపు రాజి శశాంక్‌ని దగ్గరకి తీసుకుని మాట్లాడింది.
బయలుదేరుతూ తన చేతిలో ఒక కవర్ పెట్టి, ఆఫీసులో తన డెస్కులో ఉన్న వస్తువులన్నీ ఈ కవర్లో ఉన్నాయి.మానస అప్పుడప్పుడు లంచ్ టైములో ఏదో రాస్తుండేది. మాకెవ్వరికీ తెలుగు రాదు అందుకే తను ఏమి రాస్తోందో కూదా మాకు తెలీదు.అడిగితే ఏవో చిన్న కధలు నా బ్లాగుకోసం అనేది తప్ప అంతకు మించి ఇంకెప్పుడూ నేను రెట్టించలేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా తనని గమనించి చెప్తున్నాను అందరితో ఉన్నప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఆలోచనలలోకి జారిపోయేది. ఆఫీసు బస్సులో చూసాను తన కను కొసల నుండి నీరు జారడం.ఇది చదివి తనకి మిగిలిన కోరికలేమైనా ఉన్నాయేమో చూసి వీలయితే తీర్చు దీపక్,కార్యక్రమాలన్నీ అయ్యాకా శశాంక్ ని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది.
దీపక్కి ఏమీ అర్ధం కాలేదు. మానసకి డైరీ రాసే అలవాటు లేదు తనకి తెలిసి.ఏమి రాసి ఉంటుందో అని చదవాలని కుతూహలంగా ఉన్నా ఎవరో రావడంతో పక్కన పెట్టేసాడు.జరగవలసిన కార్యక్రమాలు ఇతర పనులతో దాదాపు పదకొండో రోజు వరకూ దానిని తెరిచి చదవలేకపోయాడు.ఇక రేపటితో ఈ కార్యక్రమాలు ఆఖరు బాబూ, దానికి మనం తిలోదకాలిచ్చెస్తాము ఇక దాని ప్రయాణం అది మొదలెడుతుంది అని చెప్పారు మానస నాన్నగారు. ఆయనని చూస్తే జాలేసింది దీపక్కి.డెబ్భై ఐదేళ్ళ వయసులో రాకూడని కష్టం పాపం అనుకున్నాడు.
ఆరోజు రాత్రి డైరీ తెరిచాడు.
మొదటి పేజీలో దాదాపు ఐదేళ్ళ క్రితం తమ పెళ్ళి రోజు నాడు రాసినది.అక్షరాల వెంబడి దీపక్ కళ్ళు పరుగెత్తడం మొదలెట్టాయి. దీపూ, ఈ సంబోధన చూడగానే చిన్న అలజడి దీపక్‌లో . తాము కలిసి చదువుకునే రోజుల్లో అలా పిలిచేది మానస తనని. ఒక్కసారి ఆరోజులు గుర్తొచ్చాయి. ఆలోచనలని పక్కన పెట్టి ఏమి రాసిందో చదవడంలో మునిగిపోయాడు.
అసలు మన పెళ్ళిరోజున ఇద్దరం ఇలా ఎడ మొహం పెడ మొహంగా ఉంటామని మచ్చుకైనా అనుకోలేదు.ఏమయ్యింది దీపూ నీకు????బ్యాంకుల్లో మూలిగే డబ్బు లేకపోయినా ఇద్దరమూ సరిపోను సంపాదిస్తున్నాము.నా సంపాదన నీ కంటే ఎప్పుడూ తక్కువే అనుకో. నీ దాంట్లో సగం కూడా ఉండదని నువ్వు ఎగతాళి చేస్తే కోపమొచ్చి నీతో మాట్లాడని రోజులున్నాయి కానీ ఇప్పుడు ఆలోచిస్తే అదే నిజం కదా నిజం మాట్లాడితే నాకెందుకు కోపం అని నవ్వొస్తోంది తెలుసా.అవును నేను సెంటిమెంటల్ ఫూల్ని,ఎప్పుడూ నీకు జాగ్రత్తలు చెప్తూ ఉంటాను. కానీ ఇవన్నీ గతానుభవాల పాఠాలని నీకర్ధమయ్యేలా ఎలా చెప్పేది??చెప్తే నువ్వెమో అంతా ట్రాష్, అలా ఏమవ్వదులే నువ్వు నోర్మూసుకో అంటావు.నీకు తెలుసా నోర్మూసుకొ అంటే నా మనసెంత గాయపడుతుందో.
అదే మాట చెప్తే చెంప పగలగొట్టాలి కానీ జస్ట్ ఆ పని చెయ్యలేదని సంతోషించు అన్నావు పైగా ఎదుగుతున్న పిల్లాడి ముందు. వాడి ముందు ఏమిటా మాటలు అంటే నేర్చుకోనీ,ఆడదాని నోరు లేస్తే ఎలా ఆపాలో తెలియాలి కదా అన్నావు. అసలు నీ నోట్లో నుండి ఇలాంటి మాటలు వస్తాయని ఎవ్వరూ నమ్మరు తెలుసా?? ఒకసారి మా అమ్మా వాళ్ళకి తనతో గొడవయిందమ్మా అని చెప్తే నువ్వే ఏదో నోరు పారేసుకుని ఉంటావు అన్నారే గానీ నీ మీద పిసరంతైనా అనుమానం రాలేదు తెలుసా.నీ మీద అంత నమ్మకమున్నందుకు గర్వ పడాలో, నన్ను అర్ధం చేసుకునేవారెవ్వరని ఏడ్వాలో అర్ధం కాలేదు.
అయినా నిన్న ఏమన్నానని నా మీద చెయ్యి చేసుకున్నావు అదీ పని మనిషి ముందు?? నీ మేనళ్ళుడికి కొన్న వాచీ ఖరీదు ఐదు వేలు తక్కువెందుకు చెప్పావు అని అడిగాననే కదా. నాది తప్పే నీ ఈమెయిల్ తెరిచి చూడటం, కానీ ఎందుకు తెరిచానో తెలుసా?? నీ ఖర్చుల మీద అదుపు ఉండట్లేదు బయట వారికి పెట్టేటప్పుడు, మన శశాంక్ అడగక అడగక ఏమైనా అడిగితే కాలయాపన చేస్తున్నావు అని.దొరికిపోయినందుకు సిగ్గు పడకుండా సమర్ధించుకుంటావా?? అదే పని నేను చేసుంటే అంటే ఏమన్నావు?? ఏమో నీ జీతంతో ఎవడికి ఏమి కొనిస్తున్నావో అన్నావు “ఎవడికి” అన్న మాటని ఒత్తి పలుకుతూ. ఆ మాటకి విలవిల్లాడిపోయాను. అదే మాట నీతో చెప్తే ఆ పొడుచుకొచ్చిందండీ అంటూ ఎగతాళి.
ఇది చూడగానే ఐదేళ్ళ క్రితం మానసకి అబద్ధం చెప్పి తన మేనళ్ళుడికి కొన్న వాచీ, తదనంతర సంఘటనలు మెదిలాయి దీపక్ మనసులో.తను అడ్డంగా దొరికిపోవడంతో కోపం ఆపుకోలేక మానస మీద చెయ్యి చేసుకున్నాడు.
దీపక్ మరలా చదవడం ప్రారంభించాడు.
రాత్రి వచ్చి నేనే సారీ చెప్పి మాట్లాడినా ఉలుకూ పలుకూ ఉండదు నీ నుండి. ఆసలు కోపం వస్తే అలా బెల్లం కొట్టిన రాయిలా ఎందుకయిపోతావో అర్ధం కాదు నాకు. ఎన్ని వందల సార్లు అడిగుంటాను నిన్ను నీకు కోపమొస్తే ఏమి చెయ్యాలి అని?? ఏమన్నావో గుర్తుందా?? ఏమీ చెయ్యాకు అలా వదిలెయ్యి నాకిష్టమైనప్పుడు మాట్లాడుతాను అన్నావు. నీ అంతట నీకు కోపం తగ్గడం అనేది కల్ల, నా అంతట నేనే పలుకరిస్తే(నిజం చెప్పొద్దూ నాకు నిన్ను పలుకరించే ధైర్యం ఉండదు, ఎస్సెమ్మెస్సు, ఫోన్ల ద్వారా అడగడమే ప్లీజ్ మాట్లాడు మాట్లాడు అని. అలా ఓ పది సార్లు బ్రతిమాలించుకుని సరే మాట్లాడుతాను కానీ ఇన్ని రోజులూ ఎందుకు మాట్లాడలేదు నీకు కోపమొస్తే ఏమి చెయ్యాలి లాంటి ప్రశ్నలు ఉండకూడదు అలా అయితేనే ఓకే అంటేనే మాట్లాడతా అంటావు. ఈ మాట విని మొదట్లో ఏడుపొచ్చేది ఇప్పుడు నవ్వొస్తోంది దీపూ.
డైరీ అంతా తమ మధ్య జరిగిన గొడవలూ తను అనుభవించిన క్షోభని వివరంగా రాసుకుంది మానస.
స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ళ మీద నిలబడగలాలి అంటావు దీపూ, కానీ అవన్నీ అలా బయటకి చెప్పడానికే గానీ ఆచరించడానికి కాదు అని నేను ఉద్యోగంలో జాయిన్ అయిన కొన్ని నెలలకే అర్ధం అయ్యింది.నేను ఉద్యోగం చెయ్యడం మొదలుపెట్టి నా జీతం కూడా నువ్వు తీసుకుంటున్నా మన ఇంటి అవసరాలకే కదా అని మొదట్లో చూసీ చూడనట్లొదిలేసాను. కానీ అపాత్ర దానాలు ఎక్కువవ్వడంతో ఏమిటీ ఇదంతా అని అడిగానని నీ ఇగో దెబ్బ తింది.
నాకర్ధమయ్యిందేమిటంటే స్త్రీ అంటే చెప్పు కింద పడి ఉండాలి నీ దృష్టిలో.అలా అని నేనేమీ స్త్రీలు, స్వతంత్రత అని ఉపన్యాసాలిచ్చే రకం కూడా కాదు,నాకు కుటుంబమే ముఖ్యం. అందుకే నా తోటీవారు కెరీర్లో రాకెట్ స్పీడుతో ఎదుగుతున్నా నేనింకా మధ్య స్థాయిలోనే ఉన్నాను దీపక్.నైట్ షిఫ్టులు పని చేసే ఆడవారి మీద నీకు ఉన్న అభిప్రాయం విన్నాకా ఒళ్ళు జలదరించింది.అయినా సర్దుకుపోయాను.
నేను సర్దుకు పోతున్న కొద్దీ నీ మొండి వైఖరి మితిమీరిపోతోంది.వారాల తరబడి మాట్లాడుకోకపోవడం నిత్య కృత్యం అయిపోయింది. ఫ్రతీ సారీ నేనే వచ్చి పలకరించాలి, నీకు తెలుసు మన గొడవలన్నింటికీ కారణం నువ్వే అని. హింసించే వాడంటే తాగుడు అలవాటొ,బయట తిరగడమే కాదు దీపక్, మాటలతో గుండెల్ని చీల్చేసే నీలాంటి వాళ్ళ హింస బయటకి కనపడదు, అవన్నీ భరిస్తున్న స్త్రీ కళ్ళలోకి లోతుగా చూస్తే తప్ప. ఇలా కాదు దీపూ మనం కూర్చుని మాట్లాడుకుని చర్చించుకుందాము అంటే అవన్నీ అనవసరం అంటావు తేలికగా.
నీకర్ధం కావట్లేదు దీపూ, బీటలు వారిన మన బంధాన్ని బీట వారిన ముక్క తీసి పక్కన పెట్టకుండానే అలాగే లాగించెస్తున్నాము ఇది ఎప్పటికైనా శాశ్వతంగా మనల్ని దెబ్బ తీస్తుంది అని. అదే అంటే చివరికి జరిగేదదేలే అంటావు.మన బంధాన్ని నిలుపుకోవాలని ఒక్కదానినే ఎన్ని ప్రయత్నాలని చెయ్యాలి??
ఈ పదిహేనేళ్ళల్లో ఒక్కసారి తప్ప ప్రతీ సారీ నేనే వచ్చి మాట్లాడాను, కొత్తలో అస్సలు అర్ధమయ్యేది కాదు నా తప్పేమి లేకపోయినా నేనే ఎందుకు సారీ చెప్పాలో. కానీ నీతో మాట్లాడకుండా ఉండలేక సారీ చెప్పేదానిని.. అది ఒక అలవాటయిపోయింది నీకు. యాంత్రికంగా తయారైపోతున్నాను దీపూ, సారీ చెప్పినా మనస్ఫూర్తిగా చెప్పట్లేదు , నీ తప్పు తెలుసుకో అంటే ఏమంటావు?? ప్రతీ సారీ మాట్లాడతావుగా ఒక్కసారి మాట్లాడితే నీ సొమ్మేమీ పోదు అని ఎంత తేలికగా అంటావు?? నా గుండెల్లోని బాధ నీకెలా చెప్పాలి?? ఎంత బాధ పడుతున్నాను తెలుసా అంటే నీ వల్ల మేమేమీ ఇక్కడ సుఖాలు అనుభవించెయ్యట్లేదంటావు.
ఒక్కసారి మాత్రం ఒక ఉత్తరం రాసి ఒట్టు పెట్టుకున్నావు ఇంకేప్పుడూ నా మీద చెయ్యెత్తననీ, సూటి పోటి మాటలనననీ,జరిగిన దానికి చింతిస్తున్నాననీ. కానీ రెణ్ణెల్లు కూడా గడవకముందే నీ పాత పంధా మొదలు. అడిగితే సూటి పోటి మాటలు లేదా చేతి సత్కారాలు.
అప్పుడెందుకు ఒట్టు పెట్టుకున్నావు అంటే లేచొచ్చి నన్ను తన్నావు గుర్తుందా, బాధతో విలవిల్లాడుతూ లేవలేకపోతే శశాంక్ వచ్చి లేవదియ్యబోతే వాడినీ వారించావు మీ అమ్మ నాటకాలు నీకు తెలీవు అంటూ. నీ మీద కోపం,ఏమీ చెయ్యలేని నా నిస్సహాయతా పాపం వాడి వీపుమీద వాతలుగా తేలేవి.
ఒక మనిషికి విరక్తి కలిగితే ఏమవుతుందో చూడాలంటే నేనే ఉదాహరణ. అసలు పూర్తిగా నిన్ను పట్టించుకోవడం మానేసాను ఏదో ప్రపంచానికి భార్యా భర్తలమంతే మనము. ఎవరైనా ఇంటికొచ్చినప్పుడే మన పడకలు ఒక గదిలో లేకపోతే ఎవరి దారి వారిదే.నీ మీద నుండి మనసు మరలుంచుకోవాలని ఎన్నో వ్యాపకాలు పెట్టుకున్నాను.మొన్నటికి మొన్న ఏమిటి దీపూ ఎన్ని రోజులిలా మాట్లాడవు, ఇలా అడగకూడదనే ఎన్నో పనులతో తలమునకలవుతున్నాను అంటే ఏమో ఎవరికి తెలుసు నువ్వెందుకు అవన్నీ చేస్తున్నావో అన్నావు శ్లేషతో.అప్పటికప్పుడే భూమి చీలి నిలువునా కూరుకుపోతే బాగుండనిపించింది.
ఇవన్నీ చూసి మన పిల్లాడు కూడా ఇలా తయారయ్యి ఇంకొక అమ్మాయిని బాధపెడతాడేమో అని రోజూ రాత్రి నేను వాడితో చెప్పించే నాలుగు మాటలేమిటో తెలుసా, ఎప్పుడూ భగవంతుడి నుండి దూరం జరుగకు, అబద్ధం చెప్పకు,ఎవ్వరి మీదా చెయ్యెత్తకు ముఖ్యంగా స్త్రీల మీద, ఎక్కడా అప్పు తీసుకోకు. ఇది చదవగానే దీపక్ కళ్ళకి సన్నని నీటి పొర కమ్మింది.
అసలు వాడితో ఏమి చెప్పిస్తోందొ తెలుసుకోకుండానే మానసతో ఎంత ఎకసెక్కంగా మాట్లాడాడు తను, ఏమిటీ నీ పైత్యం అంతా వాడీకి నూరి పోస్తున్నావా వాడికి పడుకునేముందు కూడా అంటూ. అయినా తను మౌనంగా ఉందంటే…..
ఇక డైరీ చదవాలనిపించలేదు.
ఆలోచిస్తున్న కొద్దీ దీపక్ తల తిరిగిపోతోంది.మగవాడిననే అహంకారంతో ఎంత తప్పు చేసాడు,స్త్రీ అలా పడి ఉండాలంతే అని నరనరానా జీర్ణించుకుపోయిన తను పెళ్ళికి ముందు ఎన్ని తియ్యని కబుర్లు చెప్పాడు మానసతో.పాపం పిచ్చిది అవన్నీ నిజమే అని నమ్మి తనతో కలిసి ఏడడుగులు నడవగానే నిజస్వరూపం బయట పెట్టాడు.కనీసం మీ అమ్మా వాళ్ళ ముందైనా అలా పూచిక పుల్లలాగ తీసేసినట్లు మాట్లాడకు,నువ్వే గౌరవించకపోతే వాళ్ళూ అలాగే చూస్తారు అని ఎన్ని సార్లు వేడుకుందో పాపం. దానికి తనేమనెవాడు?? గౌరవం అడుక్కుంటే వచ్చేది కాదు నీ అంతట నువ్వు సంపాదించుకోవాలి వాళ్ళ దగ్గర అని ఎంత వెటకరించాడు..
తలచుకుంటున్న కొద్దీ మనసు భారమయిపోతోంది.పెళ్ళికి ముందు తను దూరమవుతుందేమో అని వేదన పడ్డ రోజులు గుర్తొచ్చాయి. కానీ ఇప్పుడు శాశ్వతంగా తనని విడిచి పెట్టి వెళ్ళిపోయింది పిచ్చిది.ఒక్క నెల ముందు ఈ డైరీ చదివుంటే తనని అర్ధం చేసుకునే వాడినేమో అన్న ఊహే తనని పిచ్చివాడిని చేస్తోంది.ఆఖరు రాత్రి కూడా నెప్పి అని చెప్పడానికొస్తే ఎంత కసురుకున్నాడు తను?? చేజేతులా తన మానసని తనే చంపుకున్నాడని అర్ధమయ్యి దీపక్ కళ్ళ నుండి ధారాపతంగా కన్నీళ్ళు కారిపోతున్నాయి,ఇదంతా తనకే కొత్తగా ఉంది, తనలో ఇంత ఆర్ద్రత ఇంకా మిగిలుందా అనుకుంటూ.అలా ఎంత సేపు ఏడ్చాడో తెలీదు.
బాబూ పంతులుగారొచ్చే టైమయ్యింది అంటూ మామగారు లేపడంతో గబగబా స్నానం చేసి తయారయ్యాడు. క్రతువంతా అయ్యాకా బాబూ ఈ పిండాన్ని అలా బయటకి తీసుకెళ్ళి పెట్టండి , పోయిన వారు కాకిరూపంలో వచ్చి స్వీకరిస్తారు అని పురోహితుడు చెప్పడంతో డాబా మీద పెట్టి నిల్చున్నాడు. ఎంత సేపైనా ఒక్క కాకి జాడ కూడా లేదు. ఇప్పుడు కాకులెక్కడ ఉన్నాయిరా, కాకి రాకపోతే ఏమి చెయ్యాలో పంతులుగారిని అడగనా అంటున్న తన తల్లి వంక తీక్షణంగా చూడటంతో ఆవిడ మిన్నకుండిపోయింది.
మానసా ప్లీజ్ నన్నిలా బాధ పెట్టకు,నిన్ను క్షోభ పెట్టానురా క్షమించు అని అరిచి కింద పడి ఏడుస్తున్నదీపక్‌ని అందరూ తెల్లబోయి చూస్తున్నారు.మానస అమ్మా నాన్నలకయితే నోట మాట లేదు.
ఇంతలో ఆకాశం అకస్మాత్తుగా చల్లబడింది, చల్లటి గాలి వీచడం మొదలయ్యింది.బాబూ వర్షం వస్తుందేమో కాకి రాకపోతే…. ఇంకా పంతులుగారి మాట పూర్తి కాలేదు ఎక్కడి నుండి వచ్చిందో ఒక కాకి వచ్చి తిని వెళ్ళిపోయింది.
థాంక్యూ మనూ థాంక్యూ ఆకాశం కేసి చూస్తూ పిచ్చిగా అరిచి కూలపడి ఏడుస్తున్న దీపక్ దగ్గరకి వెళ్ళడానికేవరూ సాహసించలేదు.
ఆరోజు రాత్రి శశాంక్ పడుకోవడానికి వెళ్ళబోతుంటే దగ్గరకి పిలిచి, ఏదీ చెప్పు, ఎప్పుడూ భగవంతుడికి..అని దీపక్ అంటుంటే శశాంక్ నోట మాట రాలేదు. తండ్రి వంక అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. “మంచీ చెడూ ఏది ఎదురైనా సరే భగవంతుడికి దూరంగా జరగకూడదు”, “ఎవ్వరి మీదా చెయ్యెత్తకూడదు ముఖ్యంగా స్త్రీ మీద”, “అబద్ధ మాడకూడదు”,”ఎవ్వరి దగ్గరా అప్పు చెయ్యకూడదు” అని చెప్పి తండ్రి భుజం మీద తల వాల్చాడు శశాంక్.
సరిగ్గా అప్పుడే గోడ మీద ఆరోజే అమర్చిన మానస ఫోటోకి వేసిన దండ లో నుండి పువ్వు జారిపడింది నేనూ మీతోనే అన్నట్లుగా.
~వాత్సల్య రావ్, సింగపూర్
========================== ========================== ==== ========================== ==============================
(కథ 2 ) Winning story at Ammulu- Telugu Short Story Writing Competition
అప్పుడే నాలుగున్నరయిపోయింది అనుకుంటూ ఒక్క ఉదుటున మంచం మీద నుండి లేచిన డెబ్భై ఏళ్ళ భాగ్య లక్ష్మి ఉరఫ్ భాగ్యం వాస్తవం గురొచ్చి మంచం మీద కూలపడిపోయింది. దాదాపు గత రెండేళ్ళుగా ఇదే తంతు, లేవడం, చేసేదేముంది అనుకుంటూ నిర్లిప్తం గా మంచం మీద కూలబడి అటూ ఇటూ దొర్లుతూ గతాన్ని నెమరు వేసుకోవడం, ఆరవ్వగానే ఇక పడుకోలేక లేచి ఇంట్లో వాళ్ళు ఎప్పుడు లేస్తారా అని ఎదురు చూడటం.. ఇదీ ఆవిడ దినచర్య.
ఐదున్నరవుతుండగా కొడుకు లేచాడు.ఏదో మీటింగున్నట్లుంది వాడికి అనుకుంది కొడుకుని చూస్తూ భాగ్యం. టీ పెట్టివ్వనా అని అడిగింది ప్రేమతో కొడుకుని,. అబ్బా అమ్మా, లేచేసావా..లేచి నువ్వేమి చెయ్యాలి విసుక్కున్నాడు కొడుకు.అలవాటు లేదురా ఇంత పొద్దెక్కాకా పడుకోవడం అనబోయి, కొడుకు సమాధానం గుర్తొచ్చి మౌనంగా తన గదిలోకి నడిచింది భాగ్యం.
గత రాత్రి కోడలు మనవడితో అన్న మాటలు గుర్తొచ్చాయావిడకి.ఏదైనా ఒక పనిని వరురగా ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తే అది అలవాటుగా మారుతుందిట.తనకి దాదాపు యాభై నాలుగేళ్ళ క్రితం అలవడిన అలవాటు, అంత త్వరగా వదులుతుందా అని తలచుకుని నిర్లిప్తంగా నవ్వుకుంది తనలో తనే.గోడ మీద భర్త ఫోటొని చూస్తూ గతంలోకి జారుకుంది భాగ్యలక్ష్మి.
పచ్చటి ప్రకృతికి నిలయమైన గోదావరి జిల్లాలలో ఓ పల్లెటూరది.ఊర్లో ఉన్న ఏకైక పాఠశాలలో ఉపాధ్యాయులు చండ శాశనుడిగా పేరుగాంచిన రామ నాధం గారు. ఆయన చిన్న కూతురు .పదహారేళ్ళ భాగ్య లక్ష్మి బట్టలుకుతూ పక్కింటి పిన్నిగారితో కబుర్లు చెప్తోంటే కొత్తగా పెళ్ళయ్యి పుట్టింటికొచ్చిన ఆమె అక్కయ్యేమో అత్తగారింటి ఆచారాల గురించి అమ్మకి ఏకరువు పెడుతోంది.
ఇంతలో ఇంటి ముందు గుర్రబ్బండి ఆగింది .రామనాధం గారిల్లిదేనా అని వినిపించిన గంభీరమైన కంఠం ఎవరిదా అనుకుంటూ బట్టలుతుకుతున్న భాగ్యం చేతికంటిన సబ్బు నురగని కూడా పట్టించుకోకుండా మీదకి పడుతున్న ముంగురులని వెనక్కి తోసుకుంటూ తడిక మీద నుండి బయటకి తొంగి చొసింది.మేము రాయవరం నుండి వచ్చాము అని ఆ యువకుడు చెప్తుండగానే రామనాధంగారిని వీధి చివరన చూసి భాగ్యం ఆ యువకుడి మాట మాట వినిపించుకోకుండా లోపలకి పరిగెత్తింది.
ఇంతలో రామనాధం గారు వడి వడిగా వచ్చి, బాబూ రండి అంటూ సాదరంగా ఆహ్వానించారు.
ఆ యువకుడితో పాటు ఒక ఆడ ఆవిడ ఇంకో ఇద్దరు మగవారు కూడా బండి దిగి లోపలకి వచ్చారు.మా వాడు అర్జెంటుగా రావాలని నిన్నే టెలిగ్రాం వచ్చిందండీ అందుకే రేపు వద్దామనుకున్నవాళ్ళం జాబు రాసే వ్యవధి లేకుండానే ఈరోజే బయలుదేరి వచ్చాము అన్నాడు ఒక పెద్ద మనిషి సంజాయిషీగా. అయ్యో ఫరవాలేదండీ అని రామ నాధం గరు పైకి అంటున్నారేకానీ ఇప్పటికిప్పుడు పెళ్ళి చూపులంటే ఎలా అని మధన పడిపోతున్నారాయన.
విషయం అంతా లోపలనుండి వింటున్న రామనాధం గారి సహ ధర్మచారిణి సీతా మహా లక్ష్మి గారి కను సైగతో ఆమె పెద్ద కూతురు భాగ్యాన్ని గబగబా లోపలకి తీసుకెళ్ళి చీరకట్టి ముస్తాబు చేసేసింది.అప్పటి వరకూ బాగానే ఉన్న భాగ్యం అకస్మాత్తుగా పెళ్ళి చూపులనేసరికి బేజారెత్తిపోయింది.అయినా తప్పక వెళ్ళి వాళ్ళ ముందు తలొంచుక్కూర్చుంది .
అబ్బాయి తరపు వాళ్ళకి అమ్మాయి నచ్చడం, తాంబూలాలూ, పెళ్ళీ అలా కలలోలాగ జరిగిపోయాయి.
పదహార్రోజుల పండగ కూడా కాకముందే తనకి శెలవు లేదంటూ భాగ్యం భర్త బయలుదేరాలనడంతో, మళ్ళీ మంచి రోజులు దగ్గరలో లేవని భాగ్యాన్ని కూడా కాపరానికి పంపించారు.
పుట్టింటిని వదిలి పయనమవుతున్న భాగ్యం మనసులో ఎన్ని ఆలోచనలూ ఆందోళనలో. ఈ గుబురు మీసం అబ్బాయికి ఏమిష్టమో నాకు తెలీదు,బామ్మేమో భర్తకి బాగా వండి పెట్టాలని పదే పదే చెప్పింది,పక్కింటి మీనాక్షేమో జాగ్రత్తకా మిలటరీ వాళ్ళకి చాలా అలవాట్లుంటాయిట అని చెప్పింది ఆరిందా లాగ.
అక్కడి ప్రదేశమేమిటో, తనకి భాష రాదు , ఎలా ఉండాలో అన్న ఆలోచనలతో, ఇంటి బెంగతోనే ఇరవై గంటలు ప్రయాణం చేసామన్న సంగతి పట్టించుకోలేదు.
సామాన్లు సర్ది పాలు పొంగించాకా ఎన్నో జాగ్రత్తలు చెప్పి తనతో వచ్చిన మేనత్త, మేనమామ వెళ్ళిపోయారు,కొన్ని రోజులయ్యాక అమ్మా నాన్నగారిని పంపిస్తామని చెప్పి.ఒక్కసారిగా శూన్యమనిపించి పెద్ద పెట్టున ఏడ్చేసింది భాగ్యం. అలా ఏడుస్తూనే నిద్రలోకి జారిపోయింది. ఎంత సేపు పడుకుందో కూడా తెలీదు,టైము చూద్దామంటే ఇంట్లో గడియారం లేదాయె.వంట చేద్దామని చూసింది కానీ వంటింట్లో పొయ్యి బదులు కరెంటు పొయ్యి ఉంది.బియ్యం కడిగి, కూరలు తరిగి పెట్టింది కానీ కరెంటు పొయ్యి ఎలా వెలిగించాలో తెలీదు. పక్కింటి వారిని అడుగుదామంటే భాష సమస్య. ఆలా బిక్కు బిక్కు మంటూ కూర్చుంది భోజనానికి వస్తానన్న భర్త వచ్చేసరికి వంట లేకపోతే ఏమంటాడో అని.
ఇంతలో వాకిట్లో అడుగుల చప్పుడయ్యింది.గభాలున వెళ్ళి తలుపు తీసింది,భర్తకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి తువ్వాలు దండెం మీద వేసి నిలబడింది, భోజనం సిద్ధంగా లేదని ఎలా చెప్పాలా అనుకుంటూ.భర్త లోపలకి రాగానే భయపడుతూ చెప్పింది వంట చెయ్యలేదని. ఒక్క క్షణం నిశ్శబ్దం.భాగ్యం మెల్లిగా తలెత్తి చూసేసరికి మిలటరీ అబ్బాయి మొహంలో ప్రశాంతమైన చిరునవ్వు.నాకు తెలుసోయ్ కరెంటు పొయ్యి నీకు అలవాటు లేదని అందుకే ఈరోజు మా ఆఫీసు క్యాంటీన్ నుండి భోజనం తెప్పిస్తున్నాను అనేసరికి సిగ్గుపడిపోయింది భాగ్యం. ఇంతలో ఆఫీసు కుర్రాడు వచ్చి క్యారేజీ తీసుకొచ్చిచ్చాడు.అలవాటు లేని కూరలు, గోధుమ రొట్టెలూనూ. కానీ ఆకలికి రుచి తెలీలేదు.సాయంత్రం నేను వచ్చాకా వంట చేసుకుందాము కంగారు పడకు అని భర్త చెప్పడంతో ఆరోజు మధ్యాహ్నమంతా పెరడూ అదీ శుభ్రం చేసుకుని బట్టలు ఉతికి ఆరేసేసరికి సాయంత్రం సైరన్ వినపడింది.
భర్త రాగానే కరెంటు పొయ్యీ అదీ ఎలా వెలిగించాలో నేర్పించాడు.రాత్రి పడుకోబోయేముందు భర్త చెప్పిన మాటని మర్చిపోదు భాగ్యం. నాకు తెల్లారకట్లే లేవడం అలవాటోయ్, లేచి పూజా అదీ చేసుకుంటాను, నువ్వేమీ నాతో పాటు లేవక్కర్లేదు, మెల్లిగా అలవాటయ్యాకా లేవొచ్చు .సూర్యోదయానికి ముందు లేవాలని మా మా బామ్మ చెప్పేది .ఇక్కడ నీకు చల్లటి వాతావరణం అదీ కొత్త కదా,మెల్లిగా అలవాటు పడుదుగానిలే, హైరానా పడకు అనేసరికి భాగ్యానికి నోట మాట రాలేదు.
ప్రతీ దానికీ చిందులు తొక్కే చండశాశనుడైన నాన్ననీ,తాతగార్లనీ చూసిన భాగ్యానికి మగవారిలో కూడా ఇంత సౌమ్యులుంటారని నమ్మడానికి చాలా కాలమే పట్టింది.
మెల్లిగా పొద్దున్నే ఆయనతో పాటే లేవడం అలవాటూ చేసుకుంది.చూస్తుండగా ఏళ్ళు గడచిపోయాయి,
పిల్లల చదువులు అయిపోయాయి. పెద్దవాడు విదేశాలు వెళ్తానంటే ప్రావిడెంటు ఫండు లోను పెట్టి పంపించారిద్దరూనూ. భాగ్యానికి కొడుకు విదేశాలకెళ్ళడం ఇష్టం లేదు కానీ క్రిష్ణమూర్తి గారే సముదాయించారు. చూడు భాగ్యం, చదివించడం వరకే మన బాధ్యత.అయినా వాడేమీ చెడు దారిలో ప్రయాణించట్లేదు కదా, మనకి కాస్త దూరంగా వెళ్తున్నాడంతే,చివరికి మనమిద్దరమేనోయ్ మిగిలేది అని నవ్వుతూనే జీవిత సత్యాన్ని చెప్పారాయన.అంతే ఇంక మాట్లాడలేకపోయింది భాగ్యం.కన్నీళ్ళతో అలా ఆయన గుండెల మీద సేదతీరింది.
రెండో వాడికి దగ్గర్లోనే ఉద్యోగం వచ్చింది. ఆడపిల్లలిద్దరూ తమకి నచ్చినవారిని తల్లితండ్రులనొప్పించి చేసుకున్నారు. ఇంతలో క్రిష్ణ మూర్తిగార్ రిటైరయ్యారు. హాయిగా ఇద్దరూ క్రిష్ణ మూర్తిగారి సొంతూరైన రాయవరం వచ్చేసారు.
అప్పట్లో కుదరని పూజలూ, వ్రతాలు,చేస్తూ నలుగురికి సహాయ పడుతూ అప్పుడప్పుడు వచ్చి పోయే మనవలూ మనవరాళ్ళతో కాలం ఎలా గడచిపోతోందో తెలీట్లేదు భాగ్యం దంపతులకి.
ఒకరోజు చిన్న కొడుకు చరణ్ నుండి ఫోను. అమ్మా మీరిద్దరూ అలా ఆ పల్లెటూర్లో ఎన్నిరోజులుంటారు మా దగ్గరికొచ్చెయ్యండంటూ.
కొన్ని రోజులు మార్పు ఉంటుందోయ్ వెళ్దాం పదా అని క్రిష్ణమూర్తి గారంటున్నా కానీ ఆయన పూజాదికాలకి అపార్టుమెంట్లలో అదీ ఇబ్బంది అని ఆవిడకి తెలుసు అదే మాట ఆయనతో అంటే, మనం ఈశ్వరారాధన తప్పించుకోవడానికి సాకులోయ్ అవన్నీను,మనకి వీలైన పూజలే చేసుకుందామక్కడ అయినా మనవలతో కొడుకు దగ్గరా గడిపే అవకాశం ఎంత మందికొస్తుంది అన్న ఆయన మాటలకి ఉప్పొంగిపోయి మరునాడే పిల్లలకి కావాల్సిన జంతికలూ అవీ చేసి సర్దుకుని బయలుదేరారు.
మహానగరపు రణగొణ ధ్వనులకి దూరంగా ఉన్న చరణ్ ఇంటిని చూసి ఎంటొ ముచ్చట పడ్డారు క్రిష్ణమూర్తి గారు.కోడలు, మనవల ఆనందానికైతే అంతే లేదు. ఇద్దరూ ఉద్యోగం అని అవసరమున్నా లేకపోయినా భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలకి పరిగెడుతున్న ఈరోజుల్లో చరణ్ భార్య శిరీష చక్కగా ఇంటి పట్టున ఉండి ఇంటిని చక్కదిద్దుకోవడం చూసి పెద్ద వాళ్ళిద్దరికీ ఆమె అంటే అభిమానం ఇంకా పెరిగింది.క్రిష్ణమూర్తి గారు పొద్దున్నే తన పూజాదికాలయిన తరువాత ఇంటి చుటూ ఉన్న స్థలంలో కూరగాయల సాగు మొదలెట్టారు.చేయి తిరిగినవారవ్వడం వల్ల తొందర్లోనే ఇంటిల్లిపాదికీ సరిపడ కూరలు ఇంట్లోనే పండించుకోవడం మొదలయ్యింది. ఇది చూసి చుట్టు పక్కల వారు కూడా వచ్చి తమకీ మెలకువలు నేర్పమనేవారు.
ఇంతలో పెద్ద కొడుకు రమ్మనమనడంతో కొన్ని రోజులు విదేశం వెళ్ళి వచ్చారు. అక్కడా ఈ దంపతుల దినచర్యలో ఏమీ మార్పు లేదు.ఎక్కడున్న ఆనందంగా ఉందటం మా అమ్మవాళ్లని చూసి నేర్చుకోవాలి అని పిల్లలే అనేకసార్లనుకునేవారు.ఇలా ఇద్దరి కొడుకుల దగ్గరా తిరుగుతూ మధ్యలో ఆడపిల్లలదగ్గరా, అందరూ కలిసి రాయవరంలో పండగలూ అవీ చేసుకుంటూ హాయిగా గడచిపోతోంది కాలం. క్రిష్ణమూర్తిగారు షష్టిపూర్తి చేసుకుని ఐదేళ్ళు దాటాయి.భాగ్యంలో కూడా ఓపిక మెల్లిగా తగ్గుతున్నా కానీ మునుపటి ఉత్సాహం మాత్రం ఇద్దరిలో పోలేదు.
మరలా తన దగ్గరకి చరణ్ రమ్మనడంతో బయలుదేరి వెళ్ళారిద్దరూ.అమ్మా శిరీష చదువుకుంటానంటోంది, పిల్లలకి కూడా ఐదేళ్ళు దాటాయి కదా,తను రెండింటికల్లా వచ్చెస్తుంది అనడంతో సంతొషంగా ఒప్పుకున్నారిద్దరూ కోడలు చదువుకుంటానంటే.మెల్లిగా మనవల బాధ్యత ఒకొక్కటీ ఈ దంపతుల నెత్తిన పడసాగింది. ఒంట్లో ఓపిక ఉండటం, మన వాళ్ళకే కదా చేసేది అన్న భావనతో ఆ దంపతులిద్దరూ ఎప్పుడూ దీన్నొక సమస్యగా భావించలేదు.
ఎప్పుడైనా భాగ్యం తోడికోడళ్ళు నీ మీద బాధ్యత ఎక్కువవ్వట్లేదూ అంటే సున్నితంగా మాట దాటేసేది కుటుంబ విషయాలు బయట వారితో చర్చించడం ఇష్టం లేక.
శిరీష చదువైపోయాకా పార్ట్ టైం ఉద్యోగం చేస్తానంటే సంతోషంగా ఒప్పుకున్నారిద్దరూను. పార్ట్ టైం కాస్త ఫుల్ టైం, ఓవర్ టైం అయ్యింది శిరీషది.ఇంట్లోకి ఇద్దరు పని మనుషులు వచ్చి చేరారు. పిల్లలు,చరణ్, శిరీషలు బయట తినేసొచ్చాము ఈరోజు అనడం నిత్య కృత్యమవ్వడంతో వృధా మెల్లిగా ఎక్కువ కాసాగింది. కొడుకూ కోడలూ అలా సూపర్ మార్కెట్టుకెళ్ళి అక్కర్లేనివీ కావాల్సినవీ చూసుకోకుండా సరుకులు అలా తెచ్చి పడెస్తున్నారంతే.ఆ సరుకులు కొన్నాళ్ళకి పురుగు పట్టి పారెయ్యడం అదీ చూస్తూ భాగ్యం ఓరోజు ఉండ బట్టలేక మెల్లిగా చెప్పింది శిరీషకి, ఇన్నిన్ని ఎందుకమ్మా తెస్తావు, ఎప్ప్పటికప్పుడు నేనో మామయ్యగారో వెళ్ళి తెస్తాము కదా అనడంతో ఎన్నడూ లేనిది శిరీష కాస్త కటువుగా సమాధానం చెప్పడంతో భాగ్యం కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
ఇదంతా క్రిష్ణమూర్తిగారు చూస్తూనే ఉన్నారు. ఆరోజు రాత్రి భార్యకి అనునయంగా చెప్పారు,ఇవన్నీ మామూలే భాగ్యం, అయినా పాపం కోడలు ఏమి చిరాకులో ఉందో ఏమిటో, కాస్త వృధా అయితే అలా బాధ పడిపోతావెందుకు??అలా అని నాకు బాధ లేదని కాదు. కాలంతో పాటే మనమూను.అన్నీ బాగుంటే ఇంకో ఐదు పదేళ్ళ వరకూ మనిద్దరికీ ఢోకాలేదోయ్.ఆ తరువాత ఒక్కరమే మిగులుతాము, అప్పుడు మనము పిల్లల దగ్గరే కదా ఉండాలి, ఇప్పుడు నువ్వు ఇవన్నీ అంటే రేపొద్దున్న వాళ్ళివ్వన్నీ మన్సులో పెట్టుకుని ఒంటరిగా మిగిలిన నిన్నో నన్నో చూడకపోతేనో?? కాబట్టి ఇవన్నీ ఆలోచనలు పెట్టుకోకుండా పడుకో.సూర్యోదయానికి ముందు లేవాలి రేపొద్దున్నే అనడంతో హాయిగా నవ్వి నిద్రలోకి జారుకుంది భాగ్యం.
ఏదో అప్పుడప్పుడు తప్ప రాయవరం వెళ్ళడమే గగనమైపోయింది.పిల్లల స్కూళ్ళకీ ఆఫీసులకీ దగ్గర అని మకాం కూడా నగరం నడి బొడ్డులోకి మార్చేసాడు చరణ్. అన్నింటినీ చిద్విలాసంగా స్వీకరించే క్రిష్ణమూర్తిగారికే బాధా లేదు, అయ్యో ఈ మొక్కలూ అవీ ఎలాగ, ఆ రణగొణ ధ్వనుల మధ్య భర్త ఉండగలడో లేదో అని చిన్నగా కొడుకు దగ్గర ఈ మాట కదిపి చూసింది.కావాలంటే మీరిక్కడే ఉండండి మేము వెళ్తున్నాము అనడంతో చేసేది లేక మహానగరపు నడి బొడ్డున ఉన్న ఆ అపార్టుమెంటులో అడుగుపెట్టారు ఒక శుభ ముహుర్తాన.
ఏళ్ళు గడచిపోతున్నాయి. చరణ్, శిరీషలు ఉద్యోగాల్లో బిజీ అయిపోయారు, వారి పిల్లలిద్దరూ టీనేజీకొచ్చారు.
ఓ రోజు భాగ్యం దగ్గరకి చరణ్ వచ్చి, అమ్మ మేము ఈ మధ్యే గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా చూసొచ్చాము, దానిలో స్విమ్మింగ్ పూల్,ఇంకా ఇతర సౌకర్యాలున్నాయి. పిల్లలు వాళ్ళ స్నేహితులందరూ అలాంటి ఇళ్ళళ్ళో ఉంటున్నారు తమకీ కావాలనడంతో మొన్నే నేనూ శిరీషా ఒకటి చూసొచ్చాము.మూడు బెడ్రూముల ఇల్లమ్మా అది కానీ కాస్త చిన్న గదులు. మీరప్పుడప్పుడు వస్తే ఉండటానికి మాత్రం ఇబ్బంది కాదు అని ఆపి తన తల్లి ఏమంటుందో అని ఆమెకేసి చూసాడు.ఉబికి వస్తున్న కన్నీళ్ళు కొడుకుకి కనిపించనీయకూడదని మీ ఇష్టమర్రా, నాన్నారు లేచే టమయ్యింది అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళింది.
ఒక శుభ ముహుర్తాన చరణ్, శిరీషల కుటుంబం విల్లాలోకి మారిపోయారు.ఇంక ఇక్కడ మనకి ఏముంది రాయవరం వెళ్ళిపోదామని ఈయనతో చెప్పాలి అనుకుంది భాగ్యం.ఆరోజు సాయంత్రం ఎప్పుడూ లేనిది ఒంట్లో నలతగా ఉందన్నారు క్రిష్ణమూర్తిగారు.డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళింది.డాక్టరుకి అనుమానం వచ్చి పెద్దాసుపత్రికి తీసుస్కెళ్ళమన్నాడు.వెళ్ళిన కాసేపటికే బైపాస్ చెయ్యాలన్నారు వైద్యులు.ఎన్నడూ ఆసుపత్రి ముఖం చూడని క్రిష్ణమూర్తిగారు అలా నీరసం గా మంచం మీద పడుకుని ఉండటాన్ని చూడలేక కుమిలి కుమిలి ఏడ్చింది.ఆయన ఇంటికొచ్చిన రోజు గుమ్మంలోనే దిష్టి నీళ్ళు తీసి లోపలకి తీసుకొచ్చింది.విదేశాల నుండి పెద్ద కొడుకు కుటుంబంతో సహా వచ్చాడు.కూతుర్లిద్దరూ కూడా కుటుంబాలతో వచ్చరు. ఓ వారం పాటు ఉన్నారందరూ.అందరూ వెళ్ళాకా చరణ్ చెప్పాడు, ఇంక మీరు రాయవరం వెళ్ళకండమ్మా,ఇక్కడే ఉంటే నేనుంటాను అవసరమయితే అనడంతో ఔననక తప్పింది కాదు ఆ దంపతులకి. కనీసం వారంలో రెండు మూడు సార్లు వచ్చి పలకరించే చరణ్ శిరీషల రాక మెల్లిగా తగ్గిపోయింది.మనుమలిద్దరూ చదువుల్లో బిజీ. ఎప్పుడైనా ఉండబట్టలేక తామే వెళ్తే అర కొర హాయ్ బాయ్ తప్ప వెరే మాటల్లేవు.తమ వెనకాల తాతా,నానమ్మా అంటూ తిరిగినది వీళ్ళేనా అనిపించేంత మార్పు.
ఇంకో ఐదేళ్ళు గడిచాయి.క్రిష్ణమూర్తి గారికి ఈ మధ్య తరచూ ఒంట్లో నలతగా ఉంటొంది.వయసు రీత్యా వచ్చే మార్పులు తప్ప మరేమీ కాదన్నారు వైద్యులు. ఇప్పుడైనా చరణ్ వాళ్ళింటికి రమ్మంటాడని ఆశగా ఎదురు చూసింది భాగ్యం. అమ్మా మీకోసం మా ఇంటి దగ్గర్లో ఇంకో ఇల్లు తీసుకున్నాను అలాగే మీ కోసం ఓ మనిషిని కూడా మాట్లాడాను 24 గంటలూ కనిపెట్టుకుని ఉండటానికి అన్న చరణ్ ని అలా చూస్తుండిపోయింది భాగ్యం.ఈ దంపతుల మకాం చరణ్ వాళ్ళింటి దగ్గరకి మారింది.క్రిష్ణ మూర్తిగారి ఆరోగ్యం మెల్లిగా సహకరించడం మానేసింది.పూజ చేసుకుంటున్నాయన ఓరోజు అలాగే చేతిలో పువ్వులు పట్టుకుని……..
కార్యక్రమాలన్నీ పిల్లలు యధా శక్తి చేసారు,కానీ అన్నీ అయ్యాకా అమ్మ ఎక్కడ ఉందాలనే ప్రశ్న.అందరు పిల్లలూ తలో పక్షం రోజులూ దగ్గర పెట్టుకుని మళ్ళీ చరణ్ వాళ్ళింట్లో దింపేసారు.ఎక్కడికెళ్ళినా అందరూ బిజీ బిజీ.ఆవిడతో మాట్లాడేవారే లేరు.అర్ధ శతాబ్దం పాటు క్రిష్ణ మూర్తిగారే లోకం గా బ్రతికిన భాగ్యానికి ఇప్పుడేమీ పాలుపోవడం లేదు.అత్తయ్యా మీరు ఇలా బాధపడుతూ కూర్చోకూడదు, అలవాటు చేసుకోవాలి ఒక్కళ్ళూ ఉండటం అని చెప్పి చక్కా ఆఫీసుకెళ్ళిపోయింది శిరీష.
చూస్తుండగా రెండేళ్ళు గడచిపోయాయి.అయినా భాగ్యంలో మార్పు లేదు.ఎప్పట్లాగే నాలుగున్నరకి మెలకువొచ్చెస్తుంది ఎంత లేవకూడదనుకున్నా కానీ. లేచి ఏమీ చేసేది కూడా ఉండదు. తన తోబుట్టువులని చూసి వద్దామంటే వారిళ్ళు చాలా దూరం.ఆ మధ్య తన తోటికోడలు అంతిమ ఘడియల్లో ఉందని కబురొస్తే గబగబా తయారయ్యి కొడుకూ కోడలకి ఫోను చేసి బయలుదేరి వెళ్ళి అక్కడే ఓ నాల్రోజులుంది. అంతే, కోడలు గయ్యిన లేచింది తిరిగొచ్చాకా. మీకు ఈ వయసులో ఇవన్నీ అవసరమా, చూసి తట్టుగోగలరా అంటూ. అదేమిటమ్మా, పెద్దత్తయ్య ఆఖరి ఘడియలని తెలిసి వెళ్ళకుండా ఎలా ఉండనంటే నువ్వేమీ వెళ్ళక్కర్లేదు, అవన్నీ చూసి నీకు బీపీ అదీ వస్తే మాకు తలనెప్పి కదా అని కోడలకి వంత పాడాడు కొడుకు. తనెక్కడకీ వెళ్ళడానికి లేదు,అంతా వారిష్ట ప్రకారమే నడచుకోవాలి. ఇంట్లో తనతో ఆప్యాయంగా మాట్లాడి తనతో ఒక్కపూటయినా కూర్చుని భోజనం చేసేవారే లేరు.
ఈ రొటీన్ జీవనానికి ముగింపు పలకాలని ఎప్పటినుండో అనుకుంటొంది కానీ అది గత వారమే కార్య రూపం దాల్చింది.మెల్లిగా తలెత్తి క్రిష్ణ మూర్తిగారి ఫొటో వైపు చూసింది మీరేమంటారు అన్నట్లుగా. నీ ఆలోచన బావుందోయ్ అన్నట్లుగా ఆయన మెడలో నుండి ఓ పువ్వు క్రింద రాలి పడింది.
చరణ్ శిరీష ఇద్దరూ లేచి ఆఫీసుకెళ్ళే హడావిడిలో ఉన్నారు.ఇంతలో భాగ్యం, చరణ్ అని పిలించింది.అమ్మా మీటింగుంది అర్జెంటా అని గదిలోంచే చిరాగ్గా అడిగాడు కొడుకు.లేదురా సాయంత్రం మాట్లాడతాను అందావిడ నిర్లిప్తంగా.
సాయంత్రం భోజనాలయ్యాకా పని చేసుకుంటున్న చరణ్ ని పిలిచిందావిడ.శిరీషని కూడా తీసుకురా అనేసరికి ఇద్దరికీ అర్ధం కాలేదు.నేను రాయవరం వెళ్దామనుకుంటున్నానురా అందావిడ. వెళ్ళమ్మా, ట్యాక్సీ ఏర్పాటు చెయ్యనా అన్నాడు ఇందుకోసమా పిల్చింది అన్నట్లుగా. అక్కర్లేదురా, నేనూ మా చెల్లి రమ వెళ్తున్నాము,నాన్నగారి తమ్ముడు శ్రీనాధ్ కూడా వస్తాడు అలాగే సుందరమ్మత్త,శేషు మామయ్య కూడా.వాహ్ బాగుంది.ఈ ఐడియా ఎవరిదమ్మా, మీరందరూ ఒంటరిగా ఉంటున్నవాళ్ళే. అందరూ కలిస్తే కాస్త మీకూ మార్పు కదా అన్నడు.అవునురా ఆ మార్పు శాశ్వతం కావాలనుకుంటున్నాను అందావిడ అంటే..అర్ధం కాలేదు చరణ్కి ఆవిడేమిచెప్తోందో. ప్రశ్నార్ధంగా చూసాడు తల్లికేసి.
అవునురా అందరమూ వెళ్ళి అక్కడే ఉందామనుకుంటున్నాము.మేము కూడా ఎప్పుడో అప్పుడు ప్రయాణం కట్టక తప్పదు కానీ ఆ లోపు మేము ఆనందంగా గడపాలనుకుంటున్నాము.వయసులో చిన్నవాళ్ళు ఇంటి బాధ్యత తీసుకుని అందరిలోకీ పెద్దవాడైన శేషు మామయ్య ని చూసుకుం టాము.తలో పనీ పంచుకుంటూ ఆనందంగా ఉందామనుకుంటున్నాము ఉన్నన్నిరోజులూనూ అందావిడ.
శిరీష ఏదో అనబోయింది కానీ ఇదేమీ పట్టించుకోని భాగ్యం,రేపు రమ పిన్ని పొద్దున్నే పదింటికి వస్తానంది రిజర్వేషన్ కూడా తీసుకున్నాము, కాస్త నేను వెళ్ళేవరకూ మీలో ఎవరైనా ఉండి ఇల్లు తాళం వేసుకుని వెళ్ళండి అనడంతో శిరీష నోరు పెగల్లేదు.
రాయవరం ఇంట్లో ఈ పెద్ద పిల్లల సందడి మొదలయ్యింది. పెద్దలు తమకి భారం అనుకున్నన్ని రోజులూ ఈ సందడి ఇక్కడ కాకపోతే మరో చోట ఏ వృద్ధ్హాశ్రమంలోనో మరోలాగ కొనసాగుతూనే ఉంటుంది.
~వాత్సల్య రావ్, సింగపూర్