పోతన – ప్రసిద్ధమైన మన తెలుగు మహాకవి. 15 శతాబ్దంలో వరంగల్లుకు కొద్ది దూరంలో ఉన్న బమ్మెర (in the Jangaon District) అనే గ్రామంలో జన్మించారని అంటారు. అయితే పుట్టిన ఊరు ఏది అన్న విషయమై కొన్న భిన్న వాదాలు ఉన్నప్పటికీ, ఆయన ప్రస్తుత తెలంగాణలోనే జన్మించారన్నది చాలామంది అభిప్రాయం. పోతన తండ్రి గారి పేరు కేసన,తల్లి గారు లక్కమాంబ. వీరి అన్న తిప్పన మరియు కుమారుడు మల్లన. బమ్మెర గ్రామం లో జన్మించినందున బమ్మెర పోతన గా జగద్విఖ్యాతి పొందారు.
పోతన నివాసగ్రామము కడపకు సమీపమున ఉన్న ఒంటిమిట్టి అనబడే ఒక గ్రామము ఇది ఏకశిలానగరము గా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలో ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు.
ఆయనను సహజకవి అని అంటారు. ఎందుకంటే ఎలాంటి విద్యాభ్యాసం లేకున్నా సరస్వతీ కటాక్షంతోనే పద్యాలు రాయగల నేర్పుని సాధించారు.
పోతన గారి కొన్ని రచనలు:
పోతన తెలుగు భాగవతము
వీరభద్ర విజయము
నారాయణ శతకము
భోగినీ దండకము
భోగినీ దండకం అనే ఈ రచన ఆనాటి రాజు సర్వజ్ఞ సింగభూపాలుని ప్రియురాలి మీద అల్లిన దండకం. ఈ దండాన్ని సింగభూపాలునికి అంకితం చేసినట్లుగా చెపుతారు. దీన్ని తెలుగులోనే తొలి దండకమని భావించేవారు చాల మందే ఉన్నారు. దక్షయజ్ఞ సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ ‘వీరభద్ర విజయం’ అనే పద్య కావ్యాన్ని రాశారు.వీరభద్ర విజయం అనేది శివభక్తితో నిండిన కావ్యం.
ఈయన రచించిన ఆంధ్ర మహా భాగవతము ని పోతన భాగవతం గా చెపుతారు.
అయితే పోతన రచించిన భాగవతం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని పోతన ఆరంభించారని కానీ దాన్ని పూర్తిచేయలేని సందర్భం లో ఆ భగవంతుడే పద్యాన్ని పూర్తిచేశాడన్న మాట ఒకటి ప్రచారంలో ఉంది.
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహిపాహి” యనఁ గుయ్యాలించి సంరంభియై.
గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుడు “పాహీ పాహీ” అని మొరపెట్టుకుంటున్నప్పుడు పోతనగారికి భగవంతుడు ఎక్కడనుండి వస్తున్నాడని వర్ణించాలో అర్ధం కాలేదు.పద్యం రాయాలంటే ఘంటం కదలట్లేదు. “అమ్మా నేను నది దగ్గరకి వెళ్ళి సంధ్యా వందనం చేసుకుని వస్తాను” అని చెప్పి వెళ్ళి అంతలోనే తిరిగొచ్చి “అమ్మా, పద్యం తట్టిందమ్మా” అంటూ పద్యం రాసి వెళ్ళారు.
సంధ్యా వందనం నుండి తిరిగొచ్చిన పోతనగారు పద్యం పూర్తి చేసి ఉండటం గమనించి కూతురిని అడిగితే “నాన్న, మీరే కదా ఇందాకా వెనక్కి వచ్చి పద్యం పూర్తి చేసి వెళ్ళారు” అనగానే పోతనగారు తెల్లబోయారు.ఆ శ్రీరామ చంద్రుడే ఈ పద్యం రాసాడంటారు.

Credits to the original uploader.
తెలుగువారమందరూ పోతనగారికి ఋణపడిఉండాలి అంత మధురమైన తెలుగు పద్యాలు అందించినందుకు. ఈ క్రింది పద్యం చూడండి, గజేంద్ర మోక్షం ఘట్టంలో లక్ష్మీ దేవికి చెప్పకుండా విష్ణు మూర్తి తన భక్తుని రక్షణార్ధం పరిగెడుతున్నప్పుడు, భార్య కొంగు తన చేతిలో ఉంది అని కూడా చూసుకోకుండా వెళ్తున్న భర్త వెంట లక్ష్మీ దేవి ఎలా వెళ్ళిందో వర్ణించే పద్యం. ఆమె ఎంత తడబడుతూ నడిచిందో పద్యం కూడా చదివినప్పుడు అలాగే ఉంటుంది
అడిగెద నని కడువడిఁ జను;
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్;
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.
బమ్మెర పోతన తన రచనల వలన చాల భక్తి రసాన్ని అందులో రామ భక్తి ని ప్రథమ స్థాయిలో ప్రచారం కల్పించారంటే దానిలో ఎటువంటి సందేహము లేదు.
ఎంత చక్కగా వర్ణించారో చుడండి. పండిత పామరులని సైతం మెప్పించిన ఘనత మన పోతన గారిదే.
“పలికెడిది భాగవతమట
పలికించెడిది రామభద్రుండట“
పోతన గారు ఆ శ్రీరామచంద్రుడికే భాగవతాన్ని అంకితమిస్తానన్నందుకు ఆయనే పోతనగారిని కాపాడుతూ ఉండేవాడంటారు.
ఒకసారి పోతన గారు తన పర్ణశాలలో కూర్చుని భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నప్పుడు అంధ్రీకరించిన భాగవతాన్ని తనకి అంకితమివ్వటానికి ఇష్టపడలేదని రాజుకి కోపము వచ్చి ఆయనని బంధించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపించాడు. సైన్యం వెళ్ళేసరికి పోతన గారి పర్ణశాల ముందు ఒక పెద్ద తెల్ల పంది పడుకుని ఉంది.సైన్యం లోపలకి వెళ్దామని ప్రయత్నిస్తే అది చేసిన గర్జనకి సైన్యం అంతా భయపడి వెనక్కి వెళ్ళి రాజుకి విషయం చెప్పారు.స్వయంగా రాజు వెళ్ళి చూసి ఇదేదో దివ్యమైన జంతువులా ఉంది,ఇటువంటి జంతువు ఈయనకి రక్షణగా ఉంది అంటే పోతనగారు ఎంతటి మహానుభావులో అనుకుని, “నేను పోతనగారికి హాని చెయ్యను, కేవలం నమస్కారం చేసుకుని వెళ్తాను” అనగానే పంది వెళ్ళిపోయింది.
రాజు లోపలకి వెళ్ళి “మేమెవ్వరమూ ఆ తెల్ల పందికి భయపడి లోపలకి రాలేకపోయాము, మీరు భగవంతుడిని ఎలా ఉపాసన చేస్తారు” అని అడిగారు.
“ఓహో నాకోసం భగవానుడూ బయట పడూకున్నాడా?మీరు వచ్చేటప్పటికి నేను యఙ వరాహమూర్తి ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను” అని చెప్పరు.
అంటే పోతన గారు తాదాత్మ్యంతో ఆ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నప్పుడు స్వయంగా భగవానుడే శ్వేత వరాహ రూపములో పోతనగారికి కాపలా కాసాడన్నమాట.దీనిని బట్టి ఆయన ఎంత భక్తితో భాగవతాన్ని ఆంధ్రీకరించారో అర్ధమవుతుంది.
బీజాక్షరాలు అందరూ పలకలేరు, అన్ని వేళలా పలకలేరు కనుక ఈ క్రింద ఇచ్చిన పోతన గారి పద్యాన్ని చదివితే “ఓం ఐం హీం శ్రీం శ్రీమాత్రే నమః ” అని పలికిన ఫలితం వస్తుంది.ఎందుకంటే ఈ క్రింది పద్యంలో “అమ్మ” అన్న శబ్దం చాలా సార్లు ఉంది, అమ్మవారిని ఏ పేరు పెట్టి పిలిచే కన్నా “అమ్మా” అని పిలిస్తే ఆవిడ త్వరగా పలుకుందిట.పిల్లలు మనల్ని “అమ్మా, అమ్మా” అని పిలుస్తూ సతాయిచ్చెస్తున్నారనుకోండి, ఎంత పనిలో ఉన్నా కూడా మనం వాళ్ళ వైపు తిరిగి “ఏమిటి” అని అడుగుతాము కదా, అలాగే అమ్మవారు కూడా ఈ పద్యాన్ని నిత్యం మీ మనసులో జపిస్తూ ఉంటే పలుకుతుందిట.

Credits to the original uploader.
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ,
చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ,
తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ,
దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
పోతన ఒకవైపు పొలం పని చేసుకుంటూ , మరోవైపు సాహిత్య రంగంలో భగవతంని అనువదించారు, భాగవత రత్నాలను పండించాడు. శివ భక్తులైన నాన్న గారి ఆచరణలో శివుని ఆరాధిస్తూనే, మరోవైపు విష్ణులీలలను భాగవతం ద్వారా ప్రకటించాడు. కటిక పేదరికం అనుభవించినా కూడా తన భాగవతాన్ని రాజుల కి అంకింతమిచ్చేందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు చదివినా కూడా పోతన భాగవత పద్యాలు కూడా అంతే నిర్మలంగా తోస్తాయి.
ముఖ్య గమనిక: ఇదంతా వివిధ వెబ్సైట్లు,పుస్తకాలు, ప్రవచనాల్లో చదివీ, విని సేకరించిన సమాచారము.ఏమైనా తప్పులున్నచో మాకు తెలియచేయండి, పరిశీలించి సవరిస్తాము.