ఆరింటికి “ఆకాశవాణి విజయవాడ కేంద్రం..” అనగానే లేచి కూచునేవాళ్ళం. గబగబా దంతధావనం కానిచ్చేసి కాసిన్ని పాలు తాగేసి హోమ్ వర్కేఁవైనా వుంటే కానిచ్చేసి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికి భక్తి రంజని మొదలయ్యేది.
సుభాషితాలు తెలుగు అనువాదంతో వచ్చేవి,తెలుగులో వార్తలు,కర్నాటక సంగీతం వినేవాళ్ళం .
స్కూలునించి మధ్యాహ్నం భోజనానికి వస్తే “ఆకాశవాణి! ఈవార్తలు ఇంతటితో సమాప్తం!” అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో..ఎవరో ఒకరు పలకరించేవారు. “అన్నాలకి లేవండి! మళ్ళా ఆలస్యఁవైందంటారు!” అని అమ్మ తరుముతోంటే గబగబా తింటూ కార్మికుల కార్యక్రమం వినేవాళ్ళం.
చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు. సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే పసిడిపంటలు మొదలయ్యేది. అంతే! పరుగోపరుగు. నడిచి స్కూలుకెళ్ళడానికి ఇరవై నిమిషాలు పట్టేది.
ఎప్పుడైనా సెలవురోజు ఇంట్లోవుంటే పసిడిపంటలవ్వగానే ప్రాంతీయ వార్తలు చదివేవారు ప్రయాగ రామకృష్ణ, తిరుమలశెట్టి శ్రీరాములు….వీళ్ళంతా! అవవ్వగానే “మనోరంజని! మీరు కోరిన మధురగీతాలు వింటారు!” అని మీనాక్షో, ఏవియస్ రామారావో అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం. ఆ అరగంటా ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచిమంచి పాటలన్నీ వేసేవారు. అవన్నీ చెవులు రిక్కించిమరీ వినేవాళ్ళం.
రెండవ్వగానే ఇంగ్లీషులో వార్తలు..ఢిల్లీనించి ప్రసారమయ్యేవి. ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం.
ఇక ఆదివారాలు బాలానందం కార్యక్రమం వచ్చేది అందులో బుజ్జి బుజ్జి గాళ్ళ మాటలు, పాటలతో ఆదివారం మధ్యాహ్నము ఒక వారం సంక్షిప్త తెలుగు శబ్ద చిత్రం ,ఒక వారం నాటిక ప్రసారం చేసేవారు. వి.వి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఏబియస్ రామారావు, పాండురంగ విఠల్… వీరందరూ ఎక్కువగా వినబడేవారు. వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులమైపోయేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.
ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ పాటలవీ వేస్తుండేవారు. అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీనుంచి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వరవిన్యాసాన్ని ఆలకించిన మాజన్మలు ధన్యం.
రేడియో ఒక ప్రసారసాధనంలానో, పాటలపెట్టెలానో కాకుండా మాకు భాషమీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రం మేమందరం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం.
~తట్టా పద్మావతి
ఈ- చెత్త ని మనలోంచి తీసెద్దాము
ఈరోజుల్లో ప్లాస్టిక్ భూతం ఎంతపెద్ద సమస్యో,అంత కంటే పెద్ద సమస్య “ఈ-చెత్త”. “ఈ” చెత్త హార్డు డిస్కుల్లోనో లేదా సర్వర్లలోనో ఉంటే ఎప్పటికప్పుడు డిలీట్ చెయ్యచ్చు కానీ అదే మన మనసుల్లో చేరిపోతేనో?ప్రొద్దున్న లేచింది మొదలు ఫోను చూడకుండా మంచం దిగనివాళ్ళెవరో చేతులెత్తండి?మనలో ముప్పావు మంది దేవుడి ఫోటో చూసినంత భక్తిగా ఫోను చూసే లేస్తాము కదా,కనీసం టైము చూడటానికో లేదా మ్రోగుతున్న అలారాన్ని ఆపడానికో. ఇంక ఆ బుల్లి పెట్టెలో తల దూర్చామా అంతే సంగతులు, గంట సమయం ఆవిరయిపోతుందంతే.
ఫోను చూస్తే “ఈ-చెత్త” మనలో ఎలా చేరుతుందనే కదా మీ ప్రశ్న? అక్కడికే వస్తున్నాను.మనము ఎక్కువగా చూసేవి సోషల్ మీడియా.ఇన్స్టాగ్రాము, ఫేస్‌బుక్కు,ట్విట్టర్ మనకి లేకపోయినా,హీన పక్షం వాట్సాప్ చూస్తాము.దానిలో ఉన్నదంతా నిజమే అనుకోవడం నేతి బీరకాయలో నెయ్యి, మైసూర్ బోండాలో మైసూరు ఉంటుందని నమ్మడమే.ఇంకా చెప్పాలంటే మనల్ని ఉద్ధరించెస్తారని నమ్మి రాజకీయ నాయకులకి ఓటు వెయ్యడం లాంటిదన్నమాట.
సోషల్ మీడియాలో కనిపించే సాన్నిహిత్యం నిజ జీవితంలో కూడా ఉంటుందా అంటే, ఖచ్చితంగా ఉండదు అని మనందరికీ తెలుసు, అది స్నేహితుల మధ్య కావచ్చు లేదా కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు.వాళ్ళు అలా ఉన్నారు, నేను కూడా అలాగే ఉండాలి అని అనుకోవడంతోనే మనలో మనకి తెలీకుండా “ఈ-చెత్త” పేరుకుపోవడం మొదలవుతుంది.
వాళ్ళ ఫోటోలని అందరూ మెచ్చుకున్నట్లు నన్ను మెచ్చుకోవట్లేదనే అక్కసు ఒకోసారి మనలో ఈర్ష్య, అసూయలకి కూడా కారణమవుతుంది.లేదా సెలెబ్రిటీల ఫోటోలు చూస్తూ వాళ్ళ లాగ మనము లేమనో,వాళ్ల లాంటి జీవితం గడపలేకపోతున్నామన్న అసంతృప్తి అనే కార్చిచ్చు బయలుదేరితే ఇంక దానిని ఆపగలిగే శక్తి దేనికుంటుంది? అది మన మనశ్శాంతిని దహించి వెయ్యదూ?ఒకళ్ళని చూసి ఉత్తేజం పొందడం ఎప్పటికీ మంచిదే కానీ వాళ్ళ కన్నా బాగా చెయ్యాలనే తపనతో మనల్ని మనం మర్చిపోవడం, మన వాళ్ళని పట్టించుకోకపోవడం ఎంత వరకూ సమంజసం?లేస్తూనే సెలెబ్రిటీలందరూ ఫోటోలో చూపించినంత అందంగా ఉండరనీ, వాళ్లనలా తయారు చెయ్యడానికి ఒక సైన్యం వారి వెనకాల ఉంటుందనీ మనకి తెలుసు.అయినా అయ్యో అలా లేమే అని బాధపడిపోతుంటాము, కానీ వారు పాటించే క్రమశిక్షణ పాటిస్తున్నామా అని మాత్రం ప్రశ్నించుకోము.
ఇంక ఫలానా వాళ్ళు ఇక్కడకి వెళ్ళారుట, నేనెప్పుడు వెళ్తానో అని లెక్క లేనన్ని సార్లు అనుకుని ఉండమూ?వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు అని వెళ్ళడం కంటే అసలు మనకి ఆ ప్రదేశం ఇష్టమేనా అని తరచి చూసుకుంటామా?వాళ్ళిక్కడకి వెళ్లారు నేను వెళ్లలేదని బాధ పడతాము కానీ ఫలానా వాళ్ళు అన్ని పుస్తకాలు చదివారుట నేను చదవలేదే అని ఒక్కసారయినా అనుకుంటామా? చదవడానికి సమయం లేదు అనడం కంటే అబద్ధపు మాట ఇంకొకటి ఉండదు.మనసుంటే మార్గముంటుంది.
ఆ మధ్య ఒక ట్రావెల్ ఆర్టికల్ ప్రకారం ఎనభై శాతం మంది భారతీయులు ప్రయాణం అంటే ఉత్సూకత, క్రొత్త ప్రదేశాలని చుట్టి రావాలనే తపన కంటే సోషల్ మీడియా కోసం ప్రయాణాలు చేస్తారుట.ఇది నిజం కాదని అనగలమా? పోనీ ఎనభై శాతం కాకపోయినా దానిలో ఆవగింజంతయినా సత్యం ఉంది కదా?
చేతిలో కెమేరా ఫోను లేకుండా దానం చెయ్యలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాము(వెళ్ళిపోయామేమో కూడా)అంటే మనిషిగా సిగ్గుపడాలి.నీది కాని వస్తువు నీకు దొరికితే నిజాయితీగా అప్పచెప్పడం కూడా టముకు వేసుకుని చెప్పల్సిన విషయమా?ప్రశాంతత కోసం దేవుడి మందిరానికో, సెలయేటి ఒడ్డుకో వెళ్ళి కూర్చోవడం కూడా ప్రపంచానికి తెలియచెయ్యాలా?తమ కూతురికో కొడుకుకో వచ్చిన మార్కులు లేదా వాళ్ళు సాధించిన విజయాలు ఒక తల్లీ, తండ్రిగా వాళ్ళకి గొప్ప కావచ్చు కానీ తాడిని తన్నే వాడుంటే వాడి తలని తన్నే వాడు ఇంకొకడు ఉంటాడన్న సామెత వినలేదా? మనకి నిజంగా ఆప్తులెవరో వారితో ఫోను చేసి పంచుకుందాం.మనం సోషల్ మీడియాలో పెడితే దానికి లైకులు కొట్టి కామెంట్లు పెట్టేవారందరిలో ఒక్కరైనా మనకి ఫోను చేసి నోరారా అభినందిస్తారా?మరింక దానికి అంత అల్లరెందుకు?
అలా అని పిల్లల విజయాలని తక్కువ చెయ్యమని కాదు.ఫలానా విజయం సాధించినందుకు పిల్లలకి ఒక పుస్తకమో మరొకటో బహుమతిగా ఇద్దాము లేదా ఈ సందర్భాన్ని పురక్సరించుకుని అన్నార్తులకో మరొకరికో పబ్లిసిటీ చేసుకోకుండా సహాయం చేద్దాము. ఆ చేతితో చేసిన దానం ఈ చేతికి తెలియకూడదన్న సామెత మర్చిపోయినట్లున్నాము మనం.
సోషల్ మీడియాని పరిమితంగా వాడుకుందాము.”ఎలా ఉన్నావు” అని అడగాలనిపిస్తే ఒక్క రెండు నిమిషాలు ఫోను చేసి అడుగుదాము.మన చేతనయినంత సమాజానికి తిరిగి ఇద్దాము తద్వారా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుందాము.
సంఘ సేవ అంటే ఇల్లు, పిల్లలలు, గొడ్డు, గోదా, పిల్లా, మేకా అన్నీ వదిలేసి సంఘ సేవలో మునిగిపోక్కరలేదు, ప్రశాంతత కోసం హిమాలయాలకి వెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చెయ్యక్కర్లేదు.ఎండలో పని చేసే కష్టజీవులకి ఒక సీసాడు మంచినీళ్ళివ్వడం కూడా సేవే కదా.
ఇంట్లో పెద్ద వాళ్ళుంటే “తిన్నావా” అని మనసారా అడుగుదాము, వీలయితే ఒక అరగంట వారితో కూర్చుని వారి మాటలు విందాము.గడచిన సమయం మళ్ళీ రాదు, ఏమో రేప్రొద్దున్న వాళ్ళు దూరమయితే మీరు వెక్కి వెక్కి ఏడుస్తారేమో?మనం పెద్దవాళ్ళని గౌరవించే విధానం చూసే మనపిల్లలలు నేర్చుకుంటున్నారన్న విషయం ఎరుకలో పెట్టుకుందాము.ఒక్కోసారి మనం ఎంత బాగా చూసుకున్నా పెద్దవారి నుండి ఇబ్బందులు ఎదురు కావచ్చు అయినా మన బాధ్యత/కర్తవ్యం మాత్రం మనం మానద్దు.
ఇప్పటికిప్పుడు కాకపోయినా రోజూ ఫోను చూసే సమయాన్ని కనీసం పది నిమిషాలు తగ్గించుకుంటూ ఆ పది నిమిషాలు ఒక మంచి పుస్తకం చదవడానికో లేదా ఆప్తులని పలకరించడానికో, లేదా అలా కళ్ళు మూసుకుని మౌనంగా కూర్చుందాము.కనీసం ఆ పది నిమిషాలయినా మన మనస్సులోకి “ఈ-చెత్త” చేరదు,ఏమంటారు?
ప్రియాతి ప్రియమైన అమ్మకు
గుర్తుందా అమ్మ నేను అక్కడ ఉన్నప్పుడు ఎంత హడావిడిగా ఉండేదో ఈ ఉగాది పండుగ. ముంగిళ్ళల్లో ముగ్గులు, గడపకు పసుపు, కుంకుమలు, మామిడి తోరణాలు ఎంత బాగా పెట్టేవాళ్ళం. అన్నయ్య ఇంకా లేవకపోతే మేము తనకి నీళ్లు తెచ్చి మొహం మీద చిలకరించి లేపే వాళ్ళం కదా! నాన్ననేమో ఏదో ఒక పని మీద బజారుకి పంపేవాళ్ళం. ఖచ్చితంగా అందరం కొత్తబట్టలు వేసుకునేవాళ్ళం. నేనైతే చక్కగా లంగా వోణి వేసుకొని అందరికీ చూపించేవరకు నిద్ర పోయేదాన్ని కాదు కదమ్మా.ముఖ్యంగా మన పక్కింటి బామ్మకి. అన్నట్లు బామ్మా ఎలా ఉందమ్మా. ముగ్గురు పిల్లలూ విదేశాల్లో స్థిరపడ్డారు కదా. ఒక్కటే ఎలా ఉండేదో ఏమో. కనిపించినప్పుడల్లా వదలకుండా కూర్చోపెట్టుకొని ఏవేవో కబుర్లు చెప్పేది. కానీ గట్టిదే కదమ్మా? తన వస్తువులని మాత్రం అంటుకోనిచ్చేది కాదు. వాళ్ళ ఇంటి పెరట్లో మామిడి చెట్టు మామిడి కాయాలిని మాత్రం ప్రతి సంవత్సరం దొంగతనం చేయందే నేను ఉరుకునేదాన్ని కాదు, లేదమ్మా బామ్మ గారి చెట్టువే రుచిగా ఉంటాయి అనేదాన్ని. తరువాత నేనైనా ఊరికినే ఉంటానా మళ్ళీ బామ్మ చేత తినిపించేదాన్ని. చాలా రుచిగా ఉంది అనేది.
ఇంకా ఏమిటమ్మా. ఇక్కడ అంతా నేనే చేసుకోవాలి. హాయిగా గంటలు గంటలు నీ దగ్గర పడుకోవటానికి అస్సలు కుదరదు. అక్కడ ఆఖరికి మంచినీళ్లు కూడా నువ్వే దగ్గరికి తెచ్చి ఇచ్చేదానివి. ఇక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు ఇష్టమైనట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆటలకి పరిగెత్తే దాన్ని. ఇక్కడ కనీసం నా స్నేహితురాళ్ళని కలవాలన్నా ఇంట్లో ఏ లోపం లేకుండా అన్నీ సమకూర్చి వెళ్ళాలి. పిల్లలిని చదివించుకోవాలి. ఈ బళ్ళెమో కానీ వాళ్ళ పరీక్షలు చూస్తుంటే నాకు రోగం వచ్చినట్లు ఉంటుంది. ఏంటో అసలు నేనెప్పుడైనా ఇంత కష్టపడ్డానా అనిపించింది. కానీ మంచి మార్కులే వచ్చేవి. హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకున్నాం కాదమ్మా.
ఇవి చెపుతూ పోతే అంతు లేని కధల్లా పోతూనే ఉంటుందిలే. సరే కానీ ఉగాది పచ్చడి బాగానే చేశాను. రుచి కూడా బాగుంది. పిల్లలు మాత్రం ఏదీ ప్రశ్న వేయకుండా తినరు కదా. అదేమంటే మేము బయటికి వెళ్లి స్వీట్ అండ్ సోర్ తిని వస్తాంలే అంటారు. ఇంకా లేదంటే మాకు పెద్దయ్యాక జీవితం లో ఇవన్నీ వద్దులే. సంతోషం ఒక్కటే కావలి. అని ఒక బెల్లం ముక్క ఒక్కటి నోట్లో పెట్టుకొని పరిగేతేస్తారు. మేమూ అంతే కదా అమ్మా? ఇప్పుడు తెలుస్తుందమ్మా జీవితం అంటే ఏమిటో. అమ్మ వాళ్ళ దగ్గర ఉండేది కేవలం ఒకటవ స్టేజి ఏ అని. తరువాత ఇంకా రొండు ముఖ్యమైన స్టేజి లు ఉంటాయని. ఒకటి భర్త తోటి మరొకటి పిల్లల తోటి.
అప్పుడు వస్తాయి ఈ షడ్రుచుల కలయిక. కానీ నిజం అమ్మా. జీవితం లో అన్నీ ఉంటేనే అది చక్కగా ఉంటుంది. లేదంటే బోరింగ్ ఏ. చిన్నప్పుడు తాతయ్య చెపుతూ ఉండేవాడు. పిల్లల్లారా! జీవితం లో ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. సుఖం, దుఃఖం, బాధ, భయం, కోపం, ఆశ్చర్యం . అన్నింటిని ఒకలాగానే తీసుకోవాలి. అందుకే ఈ షడ్రుచులతో ఉన్న ఈ ఉగాది పచ్చడి తినాలి అని చెపితే ఈ తాతయ్య ఇలానే చెపుతాడులే అని తాతా తాతా ….నాకీ పడవ చేసి పెట్టావా అని …తెగ గొడవ చేసేదాన్ని.
సరేనమ్మా, మళ్ళీ కలుస్తా.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో…
ప్రేమతో నీ హృదయ.
