Dheera

ధీర

మొదటిసారి తనని చూసినప్పుడు పెద్దగా స్పెషల్ గా అనిపించలేదు. చాలా మామూలు అమ్మాయిలానే అనిపించింది. బాగా చదువుకుంది, పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తోంది. పరాయిదేశంలో ఒంటరిగా ఉంటూ ధైర్యంగా నెట్టుకొస్తుంది. తనకి నచ్చినట్టుగా ఉంటూ, ఇష్టమైనవి చేస్తూ… ఇండియాలో ఉన్న అమ్మానాన్నలను ప్రేమగా చూసుకుంటుంది. మా ఫ్లోర్ లో ఉండే నా ఫ్రెండ్ రీనా ఇంటిలో జరిగిన సిట్టింగ్ లో మొదటిసారి చూసాను నేను తనని. పేరెంట్స్ తో బాటు వచ్చింది. చాలా జోవియల్ గా, లైవ్ లీ గా ఉంది. మనసులో ఏమీ అరమరికలు లేకుండా భలే సంతోషంగా మాట్లాడింది. తనని చూడగానే నేను పాతికేళ్లనాడు ఎలా ఉండేదానో అచ్చంగా అలానే అద్దంలో చూసుకుంటున్నట్టు అనిపించింది. పుట్టుకకు బెంగాలీ అయినా చూట్టానికి అచ్చం మిడిల్ ఈస్ట్ అమ్మాయిలా కనిపిస్తుంది. నీలి కళ్ళు, తెల్లని మేని ఛాయ, కోటేరు లాంటి ముక్కు, గిరజాల జుట్టు, ఐదడుగుల ఎనిమిదింగుళాల పొడవు.. ఓసారి చూస్తే మర్చిపోలేని ఆకర్షణీయమైన రూపం…

తర్వాత రెండు మూడు సార్లు మళ్లీ రీనా ఇంటిలోనే సిట్టింగ్ లోనే కలిశాను. హాయ్ హలో కాస్తా మంచి పరిచయంగా మారింది. బాగా జోక్స్ వేసేది. రెండు మూడు సార్లు షాపింగ్ మాల్స్ లో అనుకోకుండా కలిశాం. చక్కగా పలకరించేది. మా పాపతో దయబూచులాడేది.

ఏడాది తర్వాత రీనా బర్త్ డే సందర్భంగా పెట్టిన సిట్టింగ్ లో తను మళ్లీ కనిపించింది. అప్పుడు ఆ అమ్మాయి ఆరు నెలల ప్రెగ్నెంట్స్. కంగ్రాట్స్ చెప్పాను. హెల్త్ బాగా చూసుకో అంటూ విష్ చేశాను. ఓసారి రీనా తన ఇంటికి వెళ్లానని చెప్పాక డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసి పంపించాను. ఎప్పుడూ తన భర్త గురించి గానీ, అతని వివరాలు కానీ అడగలేదు. అస్సలు ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు నాకు.

ఓరోజు రాత్రి పది గంటలప్పుడు సడన్ గా రీనా తలుపుకొట్టి అర్జెంట్ గా నాతో రా పనివుంది అని పిలిచింది. రీనా ఒక డివోర్సీ. మల్టీ నేషనల్ కంపెనీలో సౌత్ ఈస్ట్ ఏషియాకు సేల్స్ హెడ్ గా పని చేస్తూ ఉంది. ఐదేళ్లుగా పక్క పక్క ఫ్లాట్స్ లో ఉండటం వల్ల మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం. ఆఫీస్, గురూజీ, సిట్టింగ్ తప్ప ఇంకేం పట్టని రీనాకు మా అమ్మాయి అంటే వలమాలిన ప్రేమ. అందుకే పాప వచ్చాక రీనా, నేను అక్కచెల్లెళ్ల కంటే క్లోజ్ అయ్యాం. అప్పటికే మా నాలుగేళ్ల అమ్మాయి నిద్రపోవడంతో మా ఇంట్లో ఆయనకి, మా ఫిలిప్పీన్స్ మెయిడ్ కి కాస్తా చూసుకోమని చెప్పి రీనాతో బయటికి వచ్చాను. ఫారిన్ కంట్రీస్ లో ఇలా ఒకరికొకరు తోడుగా ఉండటం మామూలే కావడంతో ఎవరికో ఏదైనా అత్యావసరం అని పిలిచిందని ముందే ఊహించాను. క్యాబ్ లో ఇద్దరం సీమ్లైన్ నుండి బడక్ రిజర్వాయర్ వైపుగా వెళ్ళాం. దారిలో రీనా చెప్పింది విని కొంచెం కంగారు పడ్డాను. తన ప్రెగ్నెంట్ ఫ్రెండ్ కి బాలేదని అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లాలని, ఒక్కదానికి ధైర్యం చాలక నన్ను పిలిచానని చెప్పింది. నేను చాలా క్యాజువల్ గా ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ తీసుకెళ్లి ఉంటారు కదా, మనం డైరెక్ట్ హాస్పిటల్ కి వెళ్లాలేమో కదా అని అన్నాను. కంగారులో తప్పుగా క్యాబ్ బుక్ చేసిందేమో అని నా ఉద్దేశ్యం. కానీ రీనా చెప్పిన విషయం విని కాస్తా ఆశ్చర్యపోయాను.

రీనా ఫ్రెండ్ కి నాలుగేళ్ళ క్రిందట పెళ్లి అయిందట. మ్యాట్రిమోనీ లో కలిశారట ఇద్దరూ. ఆ అమ్మాయి వాళ్ళాయన తనకంటే చాలా అందగాడు, చదువుకున్నాడట. చాలా పెద్ద ఉద్యోగం చేస్తూ అమెరికాలో సెటిల్ అయ్యాడట. కానీ ఇద్దరికీ పెద్దగా పొసగక రెండేళ్ల క్రిందట విడాకులు కూడా అయ్యాయట. రీనా వివరంగా చెప్పింది.

ఆమె భర్త ఆ పిల్లను చాలా చిన్నబుచ్చేవాడు. విదేశాలలో చాలా ఇబ్బందులు పడింది. అతనిని మార్చటానికి శాయశక్తులా ప్రయత్నించి విసిగిపోయింది. అతను పెద్ద సైకోలా బిహేవ్ చేసేవాడు. ఎన్ని పాజిటివ్స్ ఉన్నా కూడా అతనికి సాటిస్‌ఫాక్షన్ ఉండేదికాదు. ఎప్పుడూ ఏదైనా ఒక లోపం ఎత్తి చూపించేవాడు. తన ఎదురుగా మిగతా విదేశీ వనితలను చూపి తనని ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేలా మాట్లాడేవాడు. అతనికి నచ్చేలా ఉండటానికి ప్రయత్నించి అలసిపోయింది. అతను మాత్రం ఈ పిల్లకు ఏమాత్రం ఇష్టం లేని పనులు చేసేవాడు. ఈ అమ్మాయి ఇష్టాయిష్టాలను ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. పేరెంట్స్ కి చెప్పినా కూడా అమ్మాయిలే అడ్జస్ట్ అవ్వాలని సద్దుకుపొమ్మని చెప్పేవారు. ఇంక అతని ఆగడాలు మరీ మితిమీరటంతో తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోయినా, చాలా ధైర్యం తెచ్చుకుని విడిపోవాలని నిర్ణయించుకుంది. మొత్తానికి సింగపూరులో ఉద్యోగం రావడంతో విడాకులకు అప్లై చేసి లీగల్ గా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని సింగపూర్ వచ్చేసింది. మొదట్లో తల్లిదండ్రులు బాగా తిట్టి, గొడవ చేసినా… కొన్నాళ్ళకి అమ్మాయి సంతోషమే ముఖ్యం అని అర్ధం చేసుకుని అక్కున చేర్చుకున్నారు.

ఇవన్నీ విన్నాక ఈ విషయాలేమీ నాకు ఏమీ కొత్తగా అనిపించలేదు. ఆ అమ్మాయి మీద కొంచెం జాలి, మరి కాస్తా అభిమానం పెరిగాయి అంతే. అందుకే చాలా మామూలుగా “అవునా… పోనీలే మళ్లీ తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది కదా… ఇప్పుడు పండంటి బిడ్డ కూడా పుట్టబోతోంది. ఇంకేం కావాలి” అన్నాను.

ఈలోగా తన ఇల్లు రావడంతో రీనా క్యాబ్ వాడికి పే చేయటంలో బిజీ అయింది. బ్లాక్ నంబర్ వైపు నడుచుకుంటూ లిఫ్ట్ లో ఫ్లాట్ కి వెళ్ళాం. వెళ్ళేసరికే ఆ అమ్మాయి చిన్న బ్యాగ్ తో రెడీగా ఉంది. తనకి కొంచెం నలతగా ఉందట. నొప్పులు మొదలవుతాయని అనిపిస్తుందట. డాక్టర్ ఇచ్చిన డేట్ కి ఇంకా నాలుగు రోజులు ఉన్నా కూడా స్లాట్స్ గా క్రాంప్స్ వస్తున్నాయని రీనాకి ఫోన్ చేసిందట. రీనాతో బాటు నేను కూడా రావడంతో తను కొంచెం తడబాటుగా చూసింది. బ్యాగ్, మంచి నీళ్ళ బాటిల్ తీసుకుని తన చేయి జాగ్రత్తగా పట్టుకుని లిఫ్ట్ వైపు తీసుకెళ్తుంటే కొంచెం మొహమాట పడింది. పర్వాలేదు, ధైర్యంగా ఉండు అన్నట్టు తనకి భరోసా ఇచ్చాను. రీనా తన ఫ్లాట్ లాక్ చేసి, హాస్పిటల్ కి మరో క్యాబ్ బుక్ చేసి మా వెనకే వస్తుంది. పది నిమిషాల్లో హాస్పిటల్ లో ఉన్నాం. జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయి, డాక్టర్లు వెంటనే అటెండ్ అవ్వడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. వాళ్ళు పేరెంట్స్ తో మాట్లాడి క్షేమంగా ఉందని చెప్పింది రీనా. రాత్రికే కాన్పు అవ్వచ్చని డాక్టర్లు చెప్పారు. మరో గంట తర్వాత నన్ను వెళ్ళుమన్నట్టుగా సైగ చేసింది తను. రీనా కూడా నాకు థాంక్స్ చెప్పి నువ్వు వెళ్ళు, మీ పాపని చూసుకోవాలి కదా అంది. రేపు పొద్దున్నే నేను వస్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరాను.

మరునాడు రీనా ఫోన్ తో నిద్ర లేచాను. రాత్రి డెలివరీ అయిందని, పాప పుట్టిందని చెప్పింది. తనకి ఆఫీస్ పని మీద జకార్తా వెళ్ళే పని ఉందని, పోస్ట్ పోన్ చేయలేనని అంది. మా పాపని స్కూల్ కు పంపించి హాస్పిటల్ కి నేను వెళ్ళాను అని చెప్పాను. కానీ నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది, ఆ అమ్మాయి భర్త ఈ టైమ్ లో ఆమెను ఒక్కదానిని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు అని. మా పాపని రెగ్యులర్ డే కేర్ లో కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్ లో వేయటం వల్ల ఎనిమిదింటికి వెళ్ళి మధ్యాహ్నం నాలుగుంటికి కానీ ఇంటికి రాదు. అందుకే ఈలోగా తనకోసం కాస్తా జ్యూస్, కొంచెం వెల్లుల్లి కారం చేసి, పళ్ళు కూడా తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడ అప్పుడే పుట్టిన బుజ్జి పాపాయిని చూసిన నాకు ఎంత ఆనందం వేసిందోయ్… ఎంత ముద్దొస్తుందోయ్ బుజ్జాయి. మరో రెండు రోజులు హాస్పిటల్ కి, ఆ తర్వాత తన ఇంటికి వెళ్తూ ఉండటంతో ఆమెతో మంచి రిలేషన్ బిల్డ్ అయింది. నాకు పిల్లలింటే ఉన్న ఇష్టం కూడా ఒక కారణం కావచ్చు. ఆ బుజ్జి బుజ్జాయి కోసమే తన దగ్గరికి వెళ్ళాలని అనిపించేది. వారం రోజులైనా ఎప్పుడూ ఆ అమ్మాయి భర్త ఫోన్ చేయటం కానీ, భర్త గురించి తను మాట్లాడటం కానీ వినలేదు. రెండు మూడు సార్లు తల్లిదండ్రులు వీడియో కాల్స్ మాట్లాడటం చూశాను అంతే.

వారం తర్వాత రీనా కూడా ఆఫీస్ ట్రిప్స్ ముగించుకుని వచ్చింది. నేను ఎటువంటి వివరాలు నా అంతట నేను అడగనని రీనాకి కూడా తెలుసు కాబట్టి తను కూడా ఎప్పుడూ ఆమె భర్త టాపిక్ తేలేదు. పాపకి ఆనో అని పేరు పెట్టింది. కొంతమంది ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చి తనని విష్ చేసారు. పర్మనెంట్ గా అపాయింట్ చేసుకున్న పంజాబీ మెయిడ్ వీసా ఇష్యూ వల్ల మొత్తానికి నెల రోజులు ఆలస్యంగా పనిలోకి చేరింది. నెల రోజుల తర్వాత అనుకుంటా ఓ రోజు మా పాపని కూడా తీసుకుని, కొన్ని బొమ్మలు, తనకి ఇష్టమని చెప్పిన నిమ్మకాయ ఉప్పుడుపిండి తీసుకుని వెళ్ళాను. రీనా వాళ్ళింట్లో ఎప్పుడో తిన్నదట. అది పరోటాలో పెట్టుకుని తింటూ అమ్మ విత్ తినాలని ఉంది కానీ అంత అదృష్టం అందరికీ ఉండదు కదా అని కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళ నాన్న గారికి హార్ట్ అటాక్ వచ్చిందట. ఆయనని చూసుకోవటం కోసం వాళ్ళ అమ్మగారు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చిందట. తను ఒక్కతే కూతురు అట. అస్సలైతే డెలివరీ టైమ్ కి వాళ్ళ అమ్మగారు సింగపూర్ రావాల్సిందట. కానీ అనుకోకుండా ఇలా జరిగింది అంటూ చెప్పి బాధ పడింది.

మరో రెండు నెలలు గడిచాయి. మా పాపకి ఆనోని చూడటం, తన బోసి నవ్వులు చూస్తూ ఆడుకోవటం తెగ నచ్చేస్తుంది. అందుకే వారం వారం పాపని తీసుకుని తన ఇంటికి వెళ్ళటం, రీనా ఇంటికి ఆ అమ్మాయి వచ్చినప్పుడు మా ఇంటికి పిలిచి భోజనం పెట్టటం ఇలా పరిచయం కాస్తా ఫ్రెండ్షిప్ గా మారింది.

ఓరోజు బాగా ఆడి ఆడి పిల్లలిద్దరూ పడుకున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు వీడియో కాల్ చేశారు. ఏదో బెంగాలీలో కోపంగా మాట్లాడి పెట్టేసింది. చాలా డిస్టర్బ్ అయినట్టు ఉంది. కళ్ళలో నుంచి టపటపా కన్నీళ్లు ధార కడుతున్నాయి. వెక్కి వెక్కి ఏడుస్తుంది. తుడుచుకోమని టిష్యూస్ ఇచ్చి, కొంచెం వేడి వేడిగా హార్లిక్స్ కలిపి ఇచ్చాను. కొద్దిసేపటికి కాస్తా తేరుకుంది. థాంక్స్ అక్కా అంటూ నా వైపు తిరిగి మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ రిలేటివ్స్ ఉన్నారే వాళ్ళకేం పనుండదు. ఎవరేమైతే వాళ్ళకేంటిట. మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం ఒక్కరూ రారు. మనం బాగుంటే మాత్రం నా అనుకుంటూ వాలిపోతారు అంది. నాకు పెళ్లి అయిందోయ్ లేదోయ్ వాళ్ళకెందుకు. నా మొగుడు ఎవరు, ఏమి చేస్తాడు ఇవన్నీ వాళ్ళకి అవసరమా… విడాకులు అయ్యాక అమ్మ వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు. కానీ నాకు మాత్రం మళ్ళీ ఆ వైపు మనసు మళ్ళలేదు. అలాగని జీవితాంతం ఒక్కదాన్నే కూడా ఉండాలని అనుకోలేదు. అందుకే నాకింటూ ఒక మనిషి తోడు కావాలనుకున్నాను. నా మనిషి, నా అనుకునే మనిషి, నా బిడ్డ, నా రక్తం, నా ప్రాణం. నాకింటూ బిడ్డ కావాలనుకోవడం తప్పా… అంటూ అడుగుతోంది. తను చెప్పేది ఆసక్తిగా వింటున్న నాకు కన్నీళ్లు ఆగటం లేదు.

వాడు నన్ను ఎంత టార్చర్ పెట్టాడోయ్ తెలుసా… నా మీద నాకే అసహ్యం వేసేలా కాన్ఫిడెన్స్ ను దెబ్బ తీశాడు. నేను జాబ్ చేయటానికి తప్ప ఎందుకూ పనికిరాను అన్నాడు. ఆడతనమే లేదని అవమానించాడు. అందుకే నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను. అస్సలు మగాడి తోడు లేకుండా బిడ్డని కనాలని అనుకున్నాను. అందుకే డోనర్ స్పెర్మ్ ద్వారా ఐయుఐ పద్ధతిలో ప్రెగ్నెంట్ అయ్యాను. ఇప్పుడు నాకు ఆనో తప్ప ఇంకేం ముఖ్యం కాదు. నాకు పెళ్లి అంటే నమ్మకం పోయింది, పెళ్లి ద్వారా వచ్చే సెక్యూరిటీ వద్దు, రెస్పాన్సిబిలిటీ కూడా వద్దు. అస్సలు ఆడదానికి పక్కన మగాడు ఉంటేనే వాల్యూ పెరుగుతుందా… అలా అని పెళ్లి చేసుకున్న వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. పెళ్లిలో హ్యాపీగా ఉన్నవాళ్ళో నీతో సహా మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. రీనా లాగా విడాకుల తర్వాత మళ్ళీ పెళ్లి వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. డైవోర్స్ అయినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకుని, పిల్లలు కని హ్యాపీగా ఉన్నవాళ్ళో ఉన్నారు. కానీ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా పిల్లలు కావాలనుకుంటే తప్పా. సమాజం కోసం తప్ప మనకోసం మనం బతకకూడదా. నేను నా బిడ్డని తండ్రి ఊసు తెలియకుండా, ఏ లోటూ లేకుండా పెంచుతాను. నాకా నమ్మకం ఉంది. ఎవరేం అంటే నాకేంటి. నేను పట్టించుకోను. ధైర్యంగా ఉంటా అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్న తనని కళ్ళరెప్ప వాల్చకుండా చూస్తున్నాను. మారుతున్న సమాజానికి తను ప్రతీకలా అనిపించింది. ఏం చెప్పాలో మాట రాలేదు. పీర్ ప్రెషర్ కి తల ఒగ్గకుండా తనకు నచ్చినట్టు బతుకుతున్న తన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యం వేసింది.

అప్పటినుంచి తనని నేను చూసే విధానంలో మార్పు వచ్చింది. తను నా కంటికి చాలా ప్రత్యేకంగా కనబడుతోంది. ఇప్పుడు ఆనోకి రెండేళ్లు. నడక కూడా వచ్చేసింది. మా అమ్మాయితో బాగా ఆడుకుంటుంది. వాళ్ళ అమ్మ ఆఫీస్ పని మీద వేరే దేశాలకి వెళ్ళి నాలుగేసి రోజులు లేకపోయినా పని అమ్మాయి చాలా బాగా చూసుకుంటుంది. కొంచెం కొంచెం మాట్లాడుతోంది కూడా. వాళ్ళ తాత, అమ్మమ్మ అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటారు. వాళ్ళని చూస్తే ఎంతో మెచ్యూర్ గా అనిపించారు. పైకి చాలా క్యాజువల్ గా కనిపిస్తున్నా లోలోపల ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారిలా ఉన్నారు. కూతురి ఇష్టాన్ని మనసారా స్వాగతించే అతి కొద్దిమంది పేరెంట్స్ లో వాళ్ళు కూడా ఉన్నందుకు అనుకుంటా ఎంతో హుందాగా అనిపిస్తున్నారు నా కళ్ళకి.

రీనా నాతో ఓసారి అంది, నా భర్త ఆర్మీ డాక్టర్, నేను ఎంబీఏ. పెద్దల అనుమతితో చిన్నప్పటి ఫ్రెండ్ నే పెళ్లి చేసుకున్నా. కానీ అతను ఆశయాలు వేరు. నా ఆలోచనలు వేరు. నాకు ఉద్యోగంలో అంచలంచలుగా ఎదిగి ప్రమోషన్స్ మీద విదేశానికి రావాల్సి వచ్చింది. తనకి ఇక్కడికి రావటం ఇష్టం లేదు. నేను నా కలలను చంపుకుని అక్కడే ఆగిపోలేను. రిలేషన్ ను కాపాడుకుందాం అని కొన్నాళ్ళు టైమ్ ఇచ్చాం. ఇద్దరి ఆలోచనలు ఎక్కడా కలవలేదు. అందుకే విడాకులు తీసుకున్నాం. కానీ నాకు బిడ్డలను కనాలని ఆలోచన లేదు. నేను ఒక్కదాన్నే చూసుకోగలనన్న ధైర్యం లేదు. ఆనో లాంటి బిడ్డ కావాలని నాకూ అనిపిస్తుంది. కానీ అంత ధైర్యం నేను చేయలేనేమో అంది.

నిజమే. ఎందరో ఎన్నెన్నో అనుకుంటారు. కానీ అందరూ అన్నీ చేయలేరు. ఎవరో కొంతమంది మాత్రమే జీవితంలో తాము అనుకున్నవి అన్నీ సమాజాన్ని ఎదిరించి అయినా సాధించుకుంటారు. ఆనో అమ్మలా. ఇంతకీ తన పేరు చెప్పలేదు కదూ… కేనా. అంటే మీనింగ్ తెలుసా… గూగుల్ లో వేస్తే “Greatest champion” or “renowned for bravery” అని వచ్చింది. నిజమే తన జీవితాన్ని తానే ధైర్యంగా లిఖించుకున్న రియల్ ఛాంపియన్.

రచయిత: సాహితి

నా గురించి చెప్పాలంటే పుట్టింది పెరిగింది అంతా నా తెలుగు రాష్ట్రం లోనే. పల్లెటూర్లో చక్కటి పూబంతులతో అమ్మ వడిలో ఆడుకుంటూ పచ్చటి తోరణాలు నడుమ గారాభంగా పెరిగిన మా నాన్న ముద్దుల కూతుర్ని.. నా తెలుగు అంటే నాకు చాలా ప్రేమ. భాష మీద ఉన్న ప్రేమతో ఈ బ్లాగ్ ని ఆరంభిస్తున్నాను. మీ ప్రోత్సాహం తో ఇంకా ముందుకు నడవగలనని ఆశిస్తూ ....

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి