Decision


Story 1

Summi’s – నిర్ణయం

సరళ మనసంతా ఏదో లా ఉంది, అటు ఇటూ ఏదీ తేల్చుకోలేకపోతుంది.

సరళ కుటుంబం రెండు దశాబ్దాలకి పైగా సింగపూర్ లో ఉంటుంది. ఎంబీఏ చదివిన సరళ పెళ్ళి తరవాత సింగపూర్ కి డిపెండెంట్ వీసా మీద వచ్చింది. అప్పటికే బెంగళూరు లో సరళ చదువు పూర్తి చేసి, ఉద్యోగ ప్రయత్నం లో ఉండే. ఆ టైం లో పెళ్లి ఇప్పుడే వద్దు అని అన్నా, రైట్ ఏజ్ అనీ, మంచి సంబంధం అనీ, అమ్మానాన్న లు బలవంతం చేస్తే, ఎప్పటికైనా చేసుకునేదే కదా, అని పెళ్లికి ఒప్పుకుంది. 

సరళ భర్త సింగపూర్ లో ఒక చిన్న కంపెనీ లో ప్రోగ్రామర్ గా జాబ్ చేసే వాడు, అతని సంపాదన ఇద్దరికీ సరిపోయేది, కాస్తో కూస్తో మిగిలిన సేవింగ్స్ తో ఇండియా లో ఒక ఇల్లు కూడా. తొందరలోనే కొనగలిగారు.

ఒక రెండేళ్ళకి కి కొడుకు పుట్టినపుడు, సరళ ఇంటి పట్టునే ఉండి, కొడుకుని ఇంటిని చూసుకొని హాయిగా ఉండొచ్చు అని అనుకుంది.

కానీ, పరిస్థితులు మనం అనుకున్నట్టు ఉండవు గా.

కొడుక్కి రెండేళ్లు వచ్చినపట్టి దగ్గర నుండి,

ఖర్చు లు ఎక్కువ అవటం తో, భర్త సంపాదన సరిపోక, సేవింగ్స్ ఊసే లేకుండా పోయింది.

ఎలాగో గడుస్తుంది గా, చూద్దాం కొన్నేళ్లలో అంతా సర్దుకుంటుంది. జీతం పెరుగుతుంది అని ఆశ పడ్డారు.

కానీ అనుకోకుండా, కొడుక్కి Govt బడి లో సీట్ రాక, ప్రైవేట్ బడిలో చేర్పించారు. నెలకి వేయి డాలర్ల కి పైగా స్కూల్ ఫీ కట్టటం అంటే, ఇంటి అద్దె, మిగిలిన ఖర్చులు పోగా దాదాపు అసాధ్యం అనే అనాలి. 

అలాంటి పరిస్థితి లో సరళ కొన్ని IT కోర్సులు నేర్చుకొని, జాబ్ తెచ్చుకోగలిగింది.

ఒక ఏడాది లోనే అంతా సర్దుకుంది. కాలం గిర్రున 15 ఏండ్లు తిరిగింది.

ఇన్ని ఏండ్ల లో చాలా సార్లు పెర్మనెంట్ రెసిడెన్సీ కి ప్రయత్నం చేసినా, అది రాలేదు. 

అందుకే ఉన్నన్నాళ్లు కిరాయి ఇంట్లోనే ఉన్నారు.

ఎప్పుడైనా తిరిగి వెళ్లాల్సిందే అని సరళకి తెలుసు.

కానీ ఇంకొన్ని ఏండ్లు జాబ్ చేసి, పిల్లవాడి యూనివర్సిటీ చదువు అయిపోయాక వెళితే వాడి జీవితం ఒక గాడి లో పడుతుంది అనీ, 

ఇక్కడైతే జాబ్ చేస్తున్నా, ఇంట్లో నే హెల్పర్ ఉండటం చేత ఎక్కువ ఇబ్బంది లేకుండా

ఉంది కాబట్టి ఇంకొన్నేళ్లు ఇట్లాగే ఉద్యోగం చేస్తూ ఇంటినీ కొడుకుని చూసుకోవచ్చు అని ఆశ పడింది.

కానీ, 

రెండు నెలల కిందట సరళ మామ అనుకోకుండా హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. ఎన్నడూ ఏ జబ్బూ లేని మామ, చనిపోవటం అందరికీ షాక్ ఇచ్చింది. 

సరళ ఒక్కతే కోడలు, కాబట్టి సరళ భర్త ఇప్పుడు ఇండియా కి మొత్తం గా వెళ్ళిపోవాలి అని పట్టుబట్టాడు. 

సరళ కి చేస్తున్న ఉద్యోగం వదిలి ఇప్పటికిప్పుడు సింగపూర్ నుండి వెనక్కి వెళ్ళాలి అని లేదు. 

ఉద్యోగం ఏం పర్మనెంట్ కాదు అని సరళ కి తెలుసు. వీసా రెన్యువల్ కాకుండా వెళ్ళిపోవటం వేరు, ఉన్న ఉద్యోగం వదిలి వెళ్ళటం వేరు. 

పైగా కొడుకు వచ్చే ఏడు పదిలో ఉంటాడు. ఇన్నాళ్ళూ చదివిన బడి, స్నేహితులని వదిలి ఇప్పుడు వెళితే, వచ్చే ఏడు వాడికి కొత్త బడి, కొత్త పరిసరాలు పైగా పదవ తరగతి, ఎంత కష్టం గా ఉంటుంది అడ్జస్ట్ అవ్వటం అనే బెంగ పట్టుకుంది సరళ కి.

సరళ భర్త మాత్రం ఇన్నాళ్లు అమ్మానాన్న ఇద్దరూ ఉన్నారు కాబట్టి, వాళ్ళ మానాన వాళ్ళను వదిలేసిన, నాన్న పోయాక అమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది అని వెళ్ళివాల్సిందే, జాబ్ మానేయాల్సిందే అని అంటున్నాడు. కొడుక్కి అక్కడే పై చదువులకి బాగుంటుంది అని వాదిస్తున్నాడు.

సరళ కేమో ఇప్పుడు ఎలాగూ అత్త ఇండియా లో లేదు, అమెరికా లో తన బిడ్డ దగ్గరే ఉంటుంది. ఆమె అమ్మ ఇక్కడే ఉండేలా వీసా ఏర్పాటు చేయించుకుంటాను, కొన్నేళ్లు నా దగ్గరే అమ్మ ఉంటుంది లే అని అంటుంది. అయినా సరళ భర్త దానికి ఒప్పుకోవట్లేదు.

భర్త ఏమో ఇన్నాళ్లు అమ్మానాన్న దగ్గర లేకుండా వాళ్ళని ఒంటరిగా చేసాను అని గిల్ట్ తో ఉన్నాడు.

తన ఉద్యోగం వెంటనే వదిలేయకున్నా, సరళ నేమో, కొడుకు అకాడమిక్ ఇయర్ ఇంకో నెలలో మొదలు అవుతుంది కాబట్టి, సరళ ను ఉద్యోగం మానేసి పిల్లవాడి తో ఇండియా కి వెళ్ళిపోవాలి అని పట్టుబట్టాడు.

సరళ కేమో ఉన్న జాబ్ వదిలి ఈ పరిస్థితి లో ఇండియా కి వెళ్ళిపోవాలని అసలే లేదు. 

ఇదీ సరళ మనసంతా ఏదో లా ఉండటానికి అసలు కారణం.

ఇప్పుడు:

Ending one

భర్త పదే పదే చెప్పటం తో, ఏదో గిల్ట్ ఫీల్ అయి, సరళ తన ఉద్యోగం మానేసి , అత్త కోసం కొడుకు తో వెళ్ళాలి అని, తన మాట ఎలాగూ చెల్లదు అనీ, ఒకవేళ తను పట్టుబట్టి ఇక్కడే ఉంటే, అత్త కి ఏమైనా అయితే భర్త తనను మాటలు అంటాడు అనీ, అప్పుడు తనకీ గిల్ట్ వస్తుంది అనీ, కొడుక్కి భర్త చెప్పినట్టు ఇండియా చదువే కరెక్ట్ ఏమో అనీ, ఏదీ తనకే అర్ధం కాక

తన భర్త చెప్పినట్టు వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుంది.

Ending two.

సరళ కి అసలు అయోమయం గా ఉంది. భర్త గిల్ట్ గా ఉంది అని అంటూనే, క్యాష్ సేవింగ్స్ లేకుండా ఎలా వెళ్ళి పోతాం అనీ,ఇప్పటి వరకు దాచుకున్నదంతా ఇన్వెస్ట్మెంట్ లో నే ఉన్నాయి కదా అని సరళ అన్న మాట పట్టుకొని, ఆరు నెలలు ఇంకా ఉండేసి అప్పుడు జాబ్ మానేసి వస్తాను అని అంటాడు. తననేమో ఇప్పుడే వదిలేయ్ ఉద్యోగం, కొడుకు స్కూల్ స్టార్ట్ అయ్యే లోగా వెళ్లాల్సిందే అని అంటున్నాడు అని కోపం వచ్చింది.నేను చెప్పిన విషయం తనకి నచ్చినది అయితే సరే అని అంటాడు అని సరళ అర్ధం చేసుకుంది.

సరళ కి తెలుసు తన జాబ్ మాహా అయితే ఇంకో వన్ ఇయర్, ఆ తర్వాత వీసా రెన్యూ అయ్యేది కష్టం అని, కానీ అప్పుడు కూడా ఒక రెండు మూడు ఏండ్లు ఒక్కరి జీతం తో ఉండటం అసాధ్యం అయితే కాదు. సేవింగ్స్ మొత్తం జీరో అవుతాయి, కానీ ఇన్నాళ్లు బాగానే సేవ్ చేసుకున్నాం కాబట్టి జాబ్ పోయినా, డిపెండెంట్ వీసా మీద ఉండి, పిల్లవాడి యూనివర్సిటీ ఎక్కడ ఎట్లాగో తెలిసే వరకు ఇక్కడ ఉంటేనే బెటర్ అని నమ్మకం.

సరళ చాలా ఆలోచించింది, ఇదే పరిస్థితి లో తను ఉంటే, తన అమ్మ కోసం భర్త ఉద్యోగం మానేయి, వెళ్ళి అమ్మను చూసుకో అనే వాడా, అని ఆలోచించింది. తన అత్త కి ఉన్న బలగం, ఫైనాన్సిల్ స్థితిలో, అత్త ఎక్కడైనా హ్యాపీ గా నే గడిపేయగలదు అని,ఒక ఆరు నెలలు అమెరికా లో, ఓ మూడు నాలుగు నెలలు సింగపూర్ లో, మరో రెండు మూడు నెలలు ఇండియా లో ఉండొచ్చు అనీ, ఇప్పటికిప్పుడు పర్మినెంట్ గా వెళ్లాల్సిన అవసరం లేదనీ నిర్ణయానికి వచ్చింది.

సరళ తన సంతోషం కోసం తను పోరాడాల్సిందే, తన కి నచ్చినట్టు బతికే హక్కు ఉన్నది, తన మాట తాను గట్టిగా చెప్పాల్సిందే భర్తకి అని డిసైడ్ అయింది. 

(ఇది మన చుట్టూ జరుగుతున్న బతుకు చిత్రం, అందులో కొంతమంది ఆడవాళ్లు మాత్రమే తమ ఇష్టం కోసం, తమ హక్కు కోసం పోరాడే శక్తి ఉన్నవాళ్ళు. చదువుకున్న చదువు, చేస్తున్న ఉద్యోగం అందరికీ నిర్ణయాధికారం ఇవ్వలేక పోతుంది.పుట్టి పెరిగిన పరిస్థితులు, చిన్నప్పటి నుండి, తమ మాటకి విలువ ఇవ్వని మనుషుల మధ్య పెరిగిన ఆడవాళ్ళకి తమ నిర్ణయం మీద తమకే క్లారిటీ భరోసా ఉండవు. అందుకే కుటుంబ పరిస్థితులలో మార్పు రావాలి. ఆ మార్పు కోసం ఎదురుచూస్తూ…)

#సుమ్మీ

రచయిత: సాహితి

నా గురించి చెప్పాలంటే పుట్టింది పెరిగింది అంతా నా తెలుగు రాష్ట్రం లోనే. పల్లెటూర్లో చక్కటి పూబంతులతో అమ్మ వడిలో ఆడుకుంటూ పచ్చటి తోరణాలు నడుమ గారాభంగా పెరిగిన మా నాన్న ముద్దుల కూతుర్ని.. నా తెలుగు అంటే నాకు చాలా ప్రేమ. భాష మీద ఉన్న ప్రేమతో ఈ బ్లాగ్ ని ఆరంభిస్తున్నాను. మీ ప్రోత్సాహం తో ఇంకా ముందుకు నడవగలనని ఆశిస్తూ ....

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

Design a site like this with WordPress.com
మొదలుపెట్టండి