By Katta RajiReddy
మనుషులు నవ్వగలరు, ఏడవగలరు! జంతువులు నవ్వలేవు, కాని మనుష్యుల్లాగే అవి దుఃఖిస్తాయి.
నవ్వినపుడు మనస్సుకి హాయి కలుగుతుంది. హాయిగా నవ్వితే మనస్సు తేలికపడుతుంది. నవ్వు కొత్త వుత్సాహన్ని నింపుతుంది మనస్సులో. అందరు నవ్వగలరు, కాని ఇతరులను నవ్వించగల నేర్పు కొందరికే వుంటుంది. అందులో ఒక రాజుగారిని…, అనేక బరువు బాధ్యతలు కలిగి, ప్రజలను పరిపాలించే రాజుగారిని వినోద పరచాలంటే ప్రత్యేక ప్రతిభవున్నవారికే సాధ్యమవుతుంది.
మనిషి స్వభావాన్ని ప్రతిబింబింపచేస్తుంది అతని నవ్వు! నవ్వుని బట్టి అతని మనస్తత్వాన్ని అంచనావేయవచ్చు. మనస్సు పరిపక్వతను తెలుసుకోవచ్చు. కంటివాళ్ళను, గుడ్డివాళ్ళను చూసి నవ్వేవారు, రోడ్డుమీద కాలుజారి పడినవాడిని చాచి నవ్వేవారు మూర్ఖులు. గర్విష్టి మనస్సు ఇతరుల మనస్సు నొప్పిస్తుంది. నవ్వించి ఇతరుల మనస్సుకి మేలు చేయగలిగేది నిజమైన హాస్యము. మేధలోనుండి పుట్టే నిజమైన హాస్యము అమృతంచిలికిస్తుంది.
పూర్వకాలంలో ఆస్థాన విదూషకులుండేవారు. వాళ్ళు తమ హాస్య సంభాషణలతో రాజుగారిని వినోద పరిచేవారు. అలాంటి విదూషకులలో ప్రసిద్ది పొందినవాడు తెనాలి రామకృష్ణ. ఎలాంటి పరిస్తితిలోనైన సందర్భానికి తగినట్లుగా హాస్యము చిందించి, చతురోక్తులతో రాజుగారినే కాదు సభలోని వారినందర్ని నవ్వించేవాడు. అలాంటి తెనాలి రామకృష్ణ గురించి తెలుసుకుందామా!
పదహారో శతాబ్దపు ప్రారంభంలో ఆంధ్రరాష్ట్రానికి చెందిన “గార్లపాడు” అనే గ్రామంలో రామకృష్ణుడు జన్మించాడు. బాల్యంలోనే తండ్రి రామయ్య చనిపోవటంతో తండ్రిప్రేమకు నోచుకోలేదు. తల్లి లక్ష్మమ్మ తన స్వగ్రామమైన తెనాలికి వెళ్ళిపోయి అన్నగారింట్లో వున్నది. రామకృష్ణ అక్కడే పెరిగి పెద్దవాడవడం వల్ల తెనాలి రామకృష్ణగా పేరు పొందాడు. రామకృష్ణను బాగా చదివించాలని తల్లి ఆశపడింది. ఆరోజుల్లో వైష్ణవ మతం బాగా ప్రచారంలో వుంది. ఆగ్రామంలో వున్న ఉపాద్యాయులంతా వైష్ణవులే. వాళ్ళంతా రామకృష్ణకి చదువుచెప్పటానికి తిరస్కరించారు. కారణం రామకృష్ణ శైవమతానికి చెందినవాడు కావటమే! ఆరోజుల్లో శైవ, వైష్ణవమత సామరస్య భావనలేదు, ఒకరి నొకరు ద్వేషించుకునేవారు.
ఇక రామకృష్ణకి పూర్తి స్వేచ్ఛ లభించింది. ఉదయంనుండి రాత్రి వరకు స్వేచ్ఛగా తోటలవెంట తిరగటమే పని. చెడు సావాసాలు చేస్తూ, మామిడికాయలు, జామపండ్లు, చింతకాయలు దొంగతనంగా కోసుకుతింటూ కాలక్షేపం చేసేవాడు.
కుటుంబం దుర్భర దారిద్ర్యంలో మునిగివుంది. ఉన్న ఒక్క కొడుక్కి చదువు సంద్యలు లేవు. సంపాదన లేదు. తల్లే ఆయింటా ఈ ఇంటా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది.